– వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాయచోటి వైయస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష లతో కలసి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. తాజాగా రాయచోటి నియోజక వర్గంలోని సంబేపల్లె పర్యటన సందర్భంగా సీఎం హోదాలో కొత్త విద్యాసంస్థలు, రాయచోటి నీటికష్టాలకు పరిష్కారంను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు తీవ్ర నిరాశను మిగిల్చారని అన్నారు.
ఐటీ ఉద్యోగులను పక్కన పెట్టుకుని సంబేపల్లెలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని అందరూ ఆశించారన్న శ్రీకాంత్‌రెడ్డి.. చంద్రబాబు చెంత ఉన్న ఐటీ ఉద్యోగులు తాము తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం, మేం సంపాదించినది పార్టీ కోసం ఖర్చు చేశామని, ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నామని, గ్రామాల్లో మేమే పార్టీ బాధ్యత తీసుకున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ ప్రాంతానికి సీఎం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడే అవకాశం లభించినప్పుడు యువతకు స్పూర్తిదాయకమైన మాటలు చెబుతారని అందరూ భావించారు. కానీ దానిని కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉంది. దానికి తగినట్లుగా చంద్రబాబు మండల స్థాయిలోనే ఐటీ టవర్స్ నిర్మిస్తాను, వర్క్ ఫ్రం హోంను కూడా తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరింత ఆశ్చర్యం కలిగించిందన్నారు. వైయస్ జగన్ హయాంలో రాయచోటి ప్రజలకు నీటి కష్టాలు తప్పించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయంగా గండికోటలో నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ ద్వారా అనంతపురం జిల్లా దాటి నీళ్లు రావు కాబట్టి గండికోట నుంచి వెలిగల్లుకు అనుసంధానం చేసే పక్రియను అమలుచేసామన్నారు. కాలేటివాగును ఒక టీఎంసీకి అభివధ్ధి చేసి, అక్కడి నుంచి వెలిగల్లుకు నీటిని పంపించేందుకు వీలుగా పనులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలోనే డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు తన పర్యటనలో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త కలెక్టరేట్ భవనాలు, గండికోట నుంచి నీటిని అందించే ప్రాజెక్ట్ వంటి వాటిపై చంద్రబాబు మాట్లాడతారని అందరూ అనుకున్నారని, కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను వంచించారని, కర్నూలులో శాశ్వత హైకోర్ట్ కావాలంటే, దానికి బదులుగా బెంచ్ తో సరిపెట్టారని ఆరోపించారు. కొప్పర్తి పారిశ్రామికవాడను ఆనాడు వైయస్‌ఆర్, ఆ తరువాత వైయస్ జగన్ ప్రత్యేక సెజ్ గా అభివద్ధి చేశారని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు చొరవ చూపాలన్నారు. చేసింది చెప్పాలే కానీ జరిగిందంతా తానే చేసినట్లు చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రిగా ఆదుకున్నది వైయస్ జగన్ అని.. ఈ రోజు అన్ని అవకాశాలు ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు.
పోలవరం నుంచి కష్ణా బ్యారేజీకి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు, అక్కడి నుంచి వెలుగొండ ద్వారా బనకచర్ల క్రాస్ కు నీటిని తరలిస్తారో సరైన ప్రణాళిక ఉందా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతనే వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన ప్రాజెక్ట్ లకు రూపకల్పన జరిగి పూర్తయ్యే అవకాశం కల్గిందన్నారు. వైఎస్ఆర్ పెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ తోనే పేదలు ఇంజనీరింగ్, ఎం బిఎ, ఎం సి ఏ లు చదవగలిగారన్నారు. జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలు కడితే.. ప్రయివేట్ పరం చేయాలన్న ఉద్దేశ్యంతో ఎం సి ఐ ఇచ్చిన మెడికల్ సీట్లను కూటమి ప్రభుత్వం వద్దన్నదని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 75 వేల మెడికల్ సీట్లు ఇస్తామని ప్రకటించారని, అప్పుడు మెడికల్ సీట్లకు అంగీకరిస్తే.. ఇప్పుడు మెడికల్ కళాశాలలకు మంచి జరిగి వుండేది కదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.