26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

తల్లిదండ్రులను పోషిస్తేనే ఆస్తి హక్కులు

తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనం

తల్లి దండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానానికి సుప్రీం కోర్టు చెంప పెట్టులాంటి ఆదేశాలతో వారి బాధ్యతలను గుర్తు చేసింది. జన్మనిచ్చి, విద్యాబుద్ధులు నేర్పించి జీవితాన్ని ఒక గాడిలో పెట్టిన తల్లి దండ్రుల పట్ల ఈ తరంలో చాలా మంది చాలా నిర్లక్ష్యధోరణితో ఉంటున్నారు. అలాంటి వారంతా వారసత్వ ఆస్తిని పొందేందుకు అనర్హులని స్పష్టంచేసింది. పిల్లలకి ఒక తోడుగా ఉండి భరోసా నిచ్చి జీవితాన్ని అందించే తల్లి దండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి ఆస్తిలో హక్కు రాదని తేల్చి చెప్పింది.పిల్లలకు ఆస్తి కావాలంటే తల్లి దండ్రులను జీవితాంతం పరిరక్షించి, సేవ చేసే బాధ్యత వారిదేనని గుర్తు చేసింది.
మధ్య ప్రదేశ్ లో చిత్తాపూర్ కు చెందిన ఓ మహిళ తన కుమారుడికి తన ఆస్తిలో కొంత ఆస్తిని గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చింది. అయితే కొంత కాలం తర్వాత మిగిలిన ఆస్తి కూడా తనకే రాయాలంటూ ఆ కుమారుడు తల్లి దండ్రులపై ఒత్తిడి తేవడమే కాక వారిపై దాడి కూడా చేశాడు. కుమారుడి ప్రవర్తనతో ఖంగుతిన్న ఆ తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలని కోరింది. తల్లి దండ్రులపై కనీసం ప్రేమ చూపకపోగా దాడి చేసి, దుషించిన కొడుకును తప్పుపడుతూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆ గిఫ్ట్ డీడ్ పై ఆమె వయోధిక ఆస్తి హక్కును పునరుద్ధరించారు. హైకోర్టు సింగిల్ బెంచ్‌ జడ్జి ఈ తీర్పును సమర్ధించారు. దాంతో కుమారుడు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా ద్విసభ్య బెంచ్ ఈ తీర్పును కొట్టేసింది. ఒకసారి ఇచ్చేశాక ఆ ఆస్తి కుమారుడికే దక్కుతుందని తీర్పు చెప్పింది. దీంతో బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆస్తిని తిరిగి ఇచ్చేయండి..

సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ సీ.టి. రవికుమార్, జస్టిస్ కరోల్ ధర్మాసనం వృద్ధ దంపతులకు ఆ ఆస్తి పై పూర్తి హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసింది. తీసుకున్న ఆస్థిని ఫిబ్రవరి నెలాఖరులోగా తల్లి దండ్రులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. తల్లి దండ్రులను నిర్లక్ష్యంచేసే బిడ్డలకు ఆస్తిని పొందే హక్కు ఉండదని తేల్చి చెప్పింది.
వృద్ధతరానికి భరోసా ఆస్తి, పోషణ హక్కు చట్టం..
సమాజంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నందున సుప్రీం కోర్టు తల్లి దండ్రులు, వృద్దుల, ఆస్తి, పొషణ హక్కు చట్టం 2007 ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం సంతానం నిరాదరణకు బలయ్యే వారి పోషణ సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయాన్ని ప్రత్యేక ట్రైబ్యునళ్లు కల్పిస్తాయి. ఆస్తి పంపకాల తర్వాత తల్లి దండ్రులను బిడ్డలు నిర్లక్ష్యం చేసి, ఎదురు తిరిగితే కోర్టు ద్వారా తిరిగి తమ ఆస్తిని తామే పొందేలా తల్లి దండ్రులకు ఈ చట్టం భరోసా కల్పిస్తోంది.

ఇటీవల కాలంలో పెరుుగుతున్న కేసులు

తల్లి దండ్రులను ఆఖరు దశలో బిడ్డలు నిర్లక్ష్యం చేసి, ఆస్తి తన్నుకు పోతున్న ఘటనలు కోకొల్లలు. జీవన వార్ధక్యంలో చూసే దిక్కు లేక, చేసుకునే ఓపిక లేక తల్లి దండ్రులు వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. ఆ స్థోమత కూడా లేని బడుగు వర్గాలలో తల్లి దండ్రులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కన్న వారు మరణిస్తే కనీసం అంత్యక్రియలు కూడా చేయని పుత్ర సంతానం మనలో ఉన్నారు.అలాంటి వారందరికీ ఈ తీర్పు చెంప పెట్టు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com