కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎంపీగా ఈ రోజు లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయమే తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్‌కు చేరుకున్నారు.
లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించి ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటివరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన సోదరుడు రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో రాహుల్ పేరుతో ఉన్న మెజార్టీ రికార్డును ప్రియాంక తిరగరాశారు.