మణిపూర్‌లో శాంతిభద్రతలు క్షీణించిన నేపథ్యలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల తొమ్మొదో తేదీన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని మాసాలుగా మణిపూర్‌లో గిరిజన జాతుల మధ్య హింసకాండ చెలరేగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రభుత్వం చేతులు దాటిపోయాయి. ఈ కారణంగా మణిపూర్‌లో రాజకీయంగా అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. దీంతో మణిపూర్ పరిస్ధితులపై ముఖ్యంగా శాంతిభద్రతలు అదుపుతప్పాయని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఇచ్చిన నేవేదిక ఆధారంగా గురువారం కేంద్ర హోంశాఖ మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మణిపూర్‌లో రెండు గిరిజన జాతుల మధ్య వైరం తీవ్రమైన హింసకు దారితీసి రాష్ట్రంలో దారుణమైన హింసాకాండ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ జాతుల వైరం ఇంకా కొనసాగుతూ మణిపూర్ అగ్నిగుండంలా మండుతూనే ఉంది. మైతేయ్, కుకీ తెగల మధ్య వైరం కురుక్షేత్రంలా మారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ అల్లర్ల వెనుక ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఉన్నారని కేంద్రానికి నివేదికలు అందడంతో ఈ నెల 9వ తేదీన ఆయనతో రాజీనామా చేయించింది భారతీయ జనతా పార్టీ. రెండేళ్ళ క్రితం ఈ రెండు జాతుల మధ్య వైరం ప్రబలి మణిపూర్ రావణ కాష్టంగా మారింది. మైతేయి, కుకీ జాతుల మధ్య మారకాండ కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెపుతున్నారు. ఇప్పటికీ వేలది మంది మణిపూర్ వాసులు తమ సొంత ప్రాంతాలను వదిలి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.