22.7 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

జనాభా మూడున్నర కోట్లు – మొబైల్‌ ఫోన్లు నాలుగున్నర కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో జనాభా కంటే మొబైల్‌ ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించిన లెక్కలు వీటిని నిర్ధారిస్తున్నాయి. తెలంగాణలో యాక్టివ్‌ మొబైల్స్‌ జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి. 2023 సెప్టెంబర్‌ నాటికే తెలంగాణలో 4.5 కోట్లకు పైగా మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ఈ పరిణామం రాష్ట్రంలో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్న తీరును, రాష్ట్రంలోని కనెక్టివిటీ లెవెల్‌ను సూచిస్తోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనాభా సుమారు 3.50 కోట్లు. అయితే, 2025 నాటికి ఈ సంఖ్య కొంత పెరిగి 3.77 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర జనాభా దశాబ్ద వృద్ధి రేటు 2001 నుంచి 2011 మధ్య 13.58%గా ఉంది. ఇక, మొబైల్‌ ఫోన్‌ల విషయానికి వస్తే, రాష్ట్రంలో జనాభా కంటే సుమారు 20–25% ఎక్కువ అని చెబుతున్నారు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువగా సిమ్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఒకటి వ్యక్తిగత వినియోగం కోసం వాడితే, మరొకటి వ్యాపారం లేదా ఇంటర్నెట్‌ కోసం వినియోగిస్తున్నారు. ఈ పరిణామం మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతోంది. ఇక, గడిచిన కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరిగి పోవడం కూడా మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగేందుకు కారణమవుతోంది. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరాల్లో, ఇంటర్నెట్‌ వినియోగం చాలా ఎక్కువ. దీని కోసం చాలా మంది డేటా సిమ్‌లను అదనంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక, ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో వ్యాపార సంస్థలు, కంపెనీలు ఉద్యోగుల కోసం ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లను, హై స్పీడ్‌ కనెక్షన్లను తీసుకుంటున్నాయి. జనాభాలో కొంత శాతం మంది అంటే.. పిల్లలు, వృద్ధులు సెల్‌ఫోన్‌లను ఉపయోగించక పోయినప్పటికీ, కనెక్షన్ల సంఖ్య మాత్రం వారి సంఖ్యను కూడా మించి పోతోంది. ఇదే ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 కోట్లకు చేరే అవకాశం ఉంది. అదే సమయంలో చూసుకుంటే.. జనాభా 4 కోట్ల లోపే ఉండవచ్చు. ఈ ధోరణి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. కానీ, తెలంగాణలో ఐటీ రంగం, అధిక అక్షరాస్యత మొబైల్‌ వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com