మాజీ మంత్రి కేసీఆర్ కు.. ప్రధాని మోదీ లేఖ రాశారు. గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ సోదరి మృతిచెందడంపై ప్రధానమంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే, దీనిపై ప్రధాని మోదీ సంతాపాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ ఇటీవల అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది మంది సోదరీమణులు ఉండగా.. వారిలో సకలమ్మ ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె భర్త హన్మంతరావు గతంలోనే మృతి చెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. తీవ్రంగా వ్యాధి క్షీణించడంతో ఇటీవల సికింద్రబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కొంత కాలంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె జనవరి 25న మృతి చెందారు. ఇక కేసీఆర్ తన సోదరిని కడసారి చూసుకునేందుకు ఫౌంహౌస్ వీడి ఆమె ఇంటికి చేరుకుని ఘన నివాళులు అర్పించారు. హరీశ్ రావు, కేటీఆర్, కవిత సైతం సకలమ్మ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. సకులమ్మ కుటుంబ సభ్యులను బంధువులను కేసీఆర్ ఓదార్చారు. సోదరి మరణ వార్త విని మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి రాఖీ పండుగ నాడు తన సోదరి చేతికి రాఖీ కట్టేదని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. కేసీఆర్ సోదరి మరణంపై చింతిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, మీకు సానుభూతి తెలుపుతున్నానని పీఎం మోదీ కేసీఆర్‌కు రాసిన లేఖలో వివరించారు. సోదరి జ్ఞాపకాలు మీ నుంచి ఎప్పటికీ దూరం కావని అన్నారు. ఆ భాధ నుంచి త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మోదీ లేఖలో ఆకాంక్షించారు. ప్రధాని మోదీ లేఖ రాసిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.