- అనర్హుల పేరిట మరిన్ని పించన్ల కోతకు రంగం సిద్దం
- కూటమి ప్రభుత్వ నిర్వాకంపై మల్లాది విష్ణు ఫైర్
ఏపీలో కూటమి ప్రభుత్వం హయాంలో దాదాపు 3 లక్షల మంది పెన్షన్ లబ్ది దారులపై వేటు పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. దాదాపు మూడు లక్షల మంది లబ్దిదారుల పేర్లను పెన్షన్ల అర్హుల జాబితా నుంచి తొలగించారని ఇది దుర్మార్గమని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక భద్రతా వ్యవస్థ డేంజర్ లో పడిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రూ.92,547.66 కోట్ల మొత్తాన్ని 66,34,747 మంది లబ్ది దారులకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందించామని, వేకువ జామునే ఐదు గంటల కల్లా తలుపు కొట్టి వాలంటీర్లు పెన్షన్లను లబ్ది దారులకు అందించేవారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 63,20,282 మంది లబ్ది దారులను జాబితా నుంచి తొలగించారని అన్నారు.
పెన్షన్ల కేటాయింపులో అవకతవకలు…
ఎన్నికలకు ముందు చంద్రబాబు దురుద్దేశంతో ఈసీకి ఫిర్యాదు చేసి పెన్షన్లు లబ్దిదారులకు అందకుండా అడ్డుకున్నారని, వృద్ధులు, అనారోగ్య పీడితులు సచివాలయాల ముందు గంటల తరబడి నిరీక్షించి పెన్షన్ తీసుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. వేసవి వడగాడ్పులకు తట్టుకోలేక అప్పట్లో 45 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పయిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. దాదాపు రెండు లక్షల మంది కొత్త లబ్దిదారుల దరఖాస్తు పత్రాలను కనీసం పట్టించుకోకుండా చెత్తబుట్ట పాల్జేశారని కూటమి నేతలను తిట్టి పోశారు. మంత్రి గొట్టి పాటి రవికుమార్ ఆదేశాలతోనే కొన్ని పెన్షన్ ఖాతాలను లాగిన్ మానిప్యులేషన్ ద్వారా పొరుగూళ్లకు బదిలీ చేశారని, మరికొన్నింటిని రద్దు చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. జగన్ ప్రభుత్వ పనితీరుకు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు అసలు పోలికే లేదన్నారు. జగన్ ప్రభుత్వం సాచ్యురేషన్ పద్ధతిలో మహిళలు, అనారోగ్య పీడితులు, వ్రుద్ధులకు పెన్షన్లు కల్పించి ఆర్థిక సాయం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి అధికార దుర్వినియోగంతో లబ్దిదారుల జాబితాకు కోతలు పెడుతోందని విమర్శించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పించన్లు పొందున్న వారిలో ఐదు శాతం అనర్హులు ఉన్నట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ప్రతి జిల్లాలో ఒక వార్డు, ఒక సచివాలయం పరిధిలో చేసిన పైలట్ సర్వేలో 563 మంది పించను లబ్దిదారులు అనర్హులుగా లెక్కతేల్చారు. వీరందిరికీ నోటీసులు ఇవ్వమని ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లను సెర్స్ సీఈఓ జీ.వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. అనర్హుడైన ఏ పించనుదారుడైనా ఈ నోటీసులు తీసుకోవడానికి నిరాకరించినా, నిర్ణీత గడువులోపలు సమాధానం ఇవ్వకపోయినా తక్షణం అతని పించను హోల్డ్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ సదరు పించనుదారుడు అనర్హుడని తేలితే వెంటనే అతని పించను రద్దు చేయాలని సెర్ప్ సీఈఓ సూచించారు. పైలట్ సర్వేలోనే 563 మంది దొరికితే ఉత్తరోత్తరా రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో సామాజిక పించన్లపై సర్వే నిర్వహించి ఎన్ని లక్షల మందిని అనర్హుల సాకుతో తప్పిస్తారో అని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.