రాష్ట్రంలో మనబడి – మన భవిష్యత్తు పథకంలో ఫేజ్1,2,3 కింద చేపట్టిన పనుల వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని దశలవారీగా పూర్తిచేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో మనబడి – మనభవిష్యత్తు పనుల పురోగతిపై వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి (కోవూరు), కోళ్ల లలితకుమారి (ఎస్.కోట), గౌతు శిరీష (పలాస), పల్లె సింధూర రెడ్డి (పుట్టపర్తి) అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ… గత ప్రభుత్వం చేపట్టిన ఫేజ్-1,2 లోనే అనేక పనులు పెండింగ్ లో పెట్టారు. ఫేజ్-1,2 పనులు పూర్తిచేయడానికి రూ. 4,789 కోట్లు అవసరం. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం విడుదల చేసిన అసంబద్ధమైన జిఓ 117ను రద్దుచేస్తామని చెప్పాం. దీనివల్ల ప్రాథమిక విద్యకు పేదబిడ్డలు దూరమవుతారు. అందులో భాగంగా జిఓ 117కి ప్రత్యామ్నాయంపై దృష్టిసారించాం. దాని ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించాం.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్చక్చర్ కు స్టార్ రేటింగ్ ఇచ్చాం. నేను పరిశీలించినపుడు కొన్ని పాఠశాలల్లో టీవీలు, బెంచిలు, రంగులు ఉన్నాయి, కొన్నింటిలో అసలు ఏమి లేవు. అవి చూశాక రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, బల్లలు, తాగునీరు, విద్యుత్, టాయ్ లెట్స్ వంటివి ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అన్ని ప్రభుత్వ పాఠశాలలను 5స్టార్ రేటింగ్ కు తేవాలంటే రూ.13, 524 కోట్లు అవసరం, ఇవన్నీ ఒకేసారి చేయడం అయ్యే పనికాదు. అందరం కలసికట్టుగా పనిచేస్తే 5స్టార్ రేటింగ్ తేవడానికి 5 నుంచి 7ఏళ్లు పడుతుంది. శాసనసభ్యులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సిఎస్ఆర్ నిధులు, ఇతర కార్యక్రమాల ద్వారా నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చేయాలి. శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహించే ఉండి నియోజకవర్గంలో పాఠశాలను నేను సందర్శించాను. ఆయన స్థానికంగా నిధులు సేకరించుకొని అద్భుతంగా అభివృద్ధి చేశారు.
ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒక డిజైన్ లో లేవు. వాటి అభివృద్ధికి లోకల్ ఇనుపుట్స్, ఎమ్మెల్యేల శ్రద్ధ అవసరం. పాఠశాలల ఇన్ ఫ్రా రేటింగ్ వివరాలను సభ్యులకు ఇచ్చాం. పాఠశాలల్లో బేసిక్ ఇన్ ఫ్రాస్ట్చర్ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. పెండింగ్ వర్క్ పూర్తిచేయాలని నిర్ణయించాం, బడ్జెట్ లో నిధులు కేటాయించారు, ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేస్తాం. గ్రీన్ కవర్ పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పాల్, టింకరింగ్ ల్యాబ్స్ వంటివి ఏర్పాటుచేసి టెక్నాలజీ ఆధారిత విద్య అందించాల్సి ఉంది. జిఓ 117 ప్రత్యామ్నాయంలో మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్, టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుచేస్తాం. రాబోయే రోజుల్లో త్రీడీ ప్రింటింగ్ ల్యాబ్స్ పై దృష్టిసారిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.