ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు గబ్బర్ సింగ్ -3 మాదిరి ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గతంలో గబ్బర్ సింగ్ 1, 2లు నటించారని ఇప్పుడు గబ్బర్ సింగ్ మూడో సీక్వెల్ గుర్తుకు వచ్చేలా ఆయన ప్రవర్తన ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం విశాఖపట్నంలో బొత్స మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అవుతోందని డిప్యూటీ సీయం ఆరోపిస్తున్నారని… అయితే స్మగ్లింగ్ పై చర్యలు తీసుకోవద్దని ఆయన్ను ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. మంత్రి ప్రమేయం లేకుండానే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయా అని బొత్స నిలదీశారు. పోర్టు రెడ్డి గారికి ఉంటే మాకేంటి… చౌదరి గారికి ఉంటే మాకేం సంబంధమని బొత్స అన్నారు. 2004లో నేను తొలిసారిగా మంత్రి అయినప్పుడు నాకు ఎన్నో అధికారాలు ఉంటాయని భ్రమపడ్డానని బొత్స అన్నారు. మంత్రి అయిన కొత్తలో హూ…హా అంటూ ఉంటారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ వారూవీరూ కూర్చుని కష్టసుఖాలు అన్నీ మాట్లాడుకున్నాక ఇవన్నీ మర్చిపోతారని తెలిపారు.
హామీలు బడ్జెట్ లో కనిపించడం లేదు
కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు బడ్జెట్ లో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. విద్యాత్ ఛార్జీలు పెంచమని అసలు గతంలో పెంచిన ఛార్జీలను తగ్గిస్తమని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ట్రూఅప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గల్లీ గల్లీకి బెల్టు షాపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మా ఊళ్లోనే బెల్ట్ షాపులకు వేలం వేశారని… పరిస్ధితి ఎలా ఉందో అర్ధంచేసుకోవాలన్నారు. అసలు తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయో తెలియడం లేదని బొత్స అనుమానం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత పంచాయితీలకు రాజకీయాలు ఉండవు
పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఒక రాజకీయ పార్టీకి నాయకురాలిగా మాట్లాడటం లేదని, మీరు ఆమెని నాయకురాలిగా గుర్తిస్తున్నారేమో కానీ మేము గుర్తించడం లేదని బొత్స వ్యాఖ్యానించారు. తాను గతంలో పీసీసీ చీఫ్ గా పనిచేశానని ఎప్పుడు పార్టీ వేదికల మీద వ్యక్తిగతంగా మాట్లాడలేదని షర్మిల వ్యవహారశైలిని బొత్స ఎత్తి చూపారు. వ్యక్తిగత పంచాయితీల కోసం రాజకీయాలు లేవన్న విషయాన్ని షర్మిల గ్రహించాలని హితవు పలికారు.