- ప్రవీణ్ శరీరంలో మద్యం ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఇచ్చింది
- దారిలో ప్రవీణ్ కి మూడు సార్లు ప్రమాదాలు జరిగాయి
వివాదాస్పదమైన పాస్టర్ ప్రవీణ్ మరణం ప్రమాదం వల్లే సంభవించిందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చి చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమేవేశం నిర్వహించి పలు అంశాలను బహిర్గతం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక రకాలుగా చేసిన దర్యాప్తుతో పాటు ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చామని ఆయన తెలిపారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రీ వెళుతుండగా దారిలో పలువురితో మాట్లాడారని, వారందరితో పాటు పలువురు సాక్షులను కూడా ప్రశ్నించి సమాచారం రాబట్టామని ఐజీ అన్నారు. అలాగే ప్రవీణ్ కు సంబంధించి పలు చోట్ల సీసీ కెమెరాల ఫుటేజ్‌లను కూడా పరిశీలించినట్లు ఐజీ అశోక్ కుమార్ వివరించారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని, పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారని అన్నారు. ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎవరూ తమ వాదనను బలపరుస్తూ విచారణలో మాకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని చెప్పారు. ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే అని ఐజీ స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ తన ప్రయాణం దారి మధ్యలో కోదాడ, ఏలూరు మద్యం షాపులకు వెళ్ళారని ఆయనకు దారిలో మూడు సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు ఐజీ తెలిపారు. జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ఒక ప్రమాదం తప్పిందని, కీసర టోల్ ప్లాజా వద్ద ప్రవీన్ అదుపు తప్పి కింద పడిపోయారని ఐజీ తెలిపారు. గుంటుపల్లి దగ్గర కాసేపు ఆగిన ప్రవీణ్ ప్రెట్రోల్ బంకలోకి వచ్చేటప్పటికే బండిపై నుంచి లగేజ్ పక్కకు ఒరిగిపోయిందన్నారు. రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ కండీషన్ని ఆటో డ్రైవర్ చూశారని, అక్కడ ట్రాఫిక్ ఎస్‌ఐ సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారని, మీ కండీషన్ బాలేదు ముందుకు వెళ్ళవద్దని చెప్పినా ప్రవీణ రాజమండ్రీ వైపు బండి నడుపుకుంటూ వెళ్ళిపోయారన్నారు. అప్పటికే ప్రవీణ్ వాహనం హెడ్ లైట్ పగిలిపోవడంతో కుడివైపున ఉన్న ఇండికేటర్ ని బ్లింక్ చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఐజీ తెలిపారు. ఏలూరులో మూడో సారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారని, మద్యం షాపుకు వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయిందని ఐజీ అశోక్ కుమార్ విలేకరులకు వివరించారు. ప్రవీణ్ దారిలో ఆరు సార్లు యూపీఐ పేమెంట్లు చేశాడన్నారు. కొంతమూరు వంతెనపై పాస్టర్ ప్రవీణ్ చాలా వేగంగా బండి నడుపుకుంటూ వెళ్ళారని, ప్రమాద స్ధలంలో ప్రవీణ్ నడుపుతున్న బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకు పోయిందని చెప్పారు. ప్రవీణ్ నడుపుతున్న వాహనాన్ని వేరే ఏ ఇతర వాహనం ఢీ కొనలేదని ఆయన బండికి పక్క నుంచి వెళ్ళిన కారుకు చాలా గ్యాప్ ఉందని ఐజీ చెప్పారు. ప్రమాద స్ధలంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా కంకర రాళ్ళు ఉండటంతో బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదక చెప్పిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్ గేర్ లో ఉందని ఆయన బండిని ఇతర వాహనాలు ఢీ కొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేసినట్లు ఐజీ తెలిపారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో బహిర్గతమైనట్లు ఐజీ అశోక్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరించారు.