అమెరికాలో ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. అలాగే, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ క్షేమంగా బయట పడ్డారు. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగిందీ సంఘటన. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అప్పుడే దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, విమానంలో ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానంలో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను తెరిచారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల నుంచి ప్రయాణీకులను బయటకు పంపించారు. దీంతో, విమానం రెక్కల పైకి చేరిన ప్రయాణీకులు ఆ రెక్కల మీద ఆ చివర నుంచి ఈ చివర దాకా నిల్చున్నారు.
ఎయిర్ పోర్టు సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై విమానం రెక్కలపై నిల్చున్న ప్రయాణీకులను జాగ్రత్తగా కిందికి దింపారు. ప్రయాణీకులను రెక్కల మీద నుంచి కిందకు దించుతున్న దృశ్యాలను ఎయిర్ పోర్టులో ఉన్న ప్రయాణీకులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.
అమెరికా సమయం ప్రకారం గురువారం సాయంత్రం 5.15 గంటలకు ఈ సంఘటన జరిగింది. కొలరాడో స్ప్రింగ్ విమానాశ్రయం నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్‌కు బయలు దేరిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక సమస్య ఎదురయ్యింది. ఇంజన్‌లో వైబ్రేషన్స్ రావడంతో.. వెంటనే విమానాన్ని డెన్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. అత్యవసరంగా విమానాశ్రయం లోని టాక్సీయింగ్ ప్రదేశంలో విమానం ల్యాండ్ అయ్యిది. అయితే, ఆ వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణీకులను ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా దించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఓవైపు ప్రయాణీకులను దింపుతుండగానే విమానం మొత్తం దగ్ధమయ్యింది.