- దేశవ్యాప్తంగా నిరసనలతో కాంగ్రెస్ దూకుడు
- పోటీగా బీజేపీ ఎంపీల కౌంటర్
- అంబేద్కర్ని అవమానించారంటూ పరస్పర విమర్శలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల దుమారం పార్లమెంటు ఉభయ సభలను పట్టి కుదిపేస్తోంది. ఇవాళ పార్లమెంటు ప్రాంగణంలో తమ నిరసనలు తెలియన చేసిన కాంగ్రెస్ అమిత్ షా రాజీనామా చేయాలని, తక్షణం జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. పార్లమెంటు ప్రాంగణంలో ప్లకార్డులతో కాంగ్రెస్ సభ్యులు నిరసనలు తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ మణికమ్ ఠాగూర్, లోక్ సభలో ఎంపీ సురేష్ అమిత్ షా వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాలని ఉభయ సభలలోనూ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు.అయితే ఇందుకు కౌంటర్ గా బీజేపి కూడా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగింది.తమ ఎంపీలతో కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానిస్తోందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపింది. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఎడిట్ చేసిన వెర్షన్ ను సర్క్యులేషన్ లోకి తెచ్చి కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ కి పాల్పడుతోందని బీజేపి ఆరోపిస్తోంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
అటు సోషల్ మీడియాలోనూ అమిత్ షా కామెంట్లే ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. తమిళనాడు రాజకీయ నేత, సెలబ్రిటీ కమల్ హాసన్ కూడా దీనిపై స్పందించారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు అత్యంత దురద్రుష్టకరమని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కూడా అమిత్ షాను తప్పుబట్టారు. మరోవైపు పెరుగుతున్న అసమ్మతిని కట్టడి చేయడానికి బీజేపీ పెద్దలు కూడా రంగంలోకి దిగారు.. యూపీ సీఎం ఆదిత్య నాథ్ కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తోందని, అణ గారిన వర్గాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, బీజేపి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వారికి న్యాయంచేస్తోందని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఇవాళ నిరసన ప్రదర్శనలకు పిలుపు నిచ్చింది. పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని నిలదీస్తే బీజేపికి జోకులా కనిపిస్తోందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత కే.సి. వేణు గోపాల్ ప్రశ్నించారు.
అదే ధోరణి.. అంబేద్కర్ మనుమడి విమర్శ
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను అంబేద్కర్ మనుమడు కూడా ఖండించారు. అణగారిన వర్గాల చైతన్యం కోసం ఆరాట పడిన అంబేద్కర్ పై బీజేపి తన అహంకార, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని, పాత మెంటాలిటీ, పాత వాసనలు ఆ పార్టీని ఇంకా వెంటాడుతున్నాయని విమర్శించారు.