రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టడానికి భారత్ నుంచి అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ప్రపంచ దేశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిబల్ స్వాగతించారు. చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టంలో సవరణలు చేసిన పాకిస్తాన్ స్వయంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటే అని కపిల్ సిబాల్ అన్నారు. ఉగ్రవాదం నుంచి భారత్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని అందువల్ల ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడుచి పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చేర్యలు తీసుకోవాలని సిబాల్ కోరారు. పాకిస్తాన్‌ని ఉగ్రవాద దేశంగా ప్రకటించేలా ఐక్యరాజ్య సమతిలో సవరణ తీసుకు వచ్చేలా కృషి చేయాలని కపిల్ సిబాల్ సూచించారు. ఉగ్రవాద నిర్మూలన భారత్ పాకిస్తాన్లకే కాకుండా ప్రపంచ దేశాల పురోగతికి ఉపయోగపడుతుందని కపిల్ సిబాల్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ప్రజలు నిశ్చింతగా జీవించాలంటే భారత విదేశాంగ శాఖ ఈ చర్యలు తప్పని సిగా తీసుకవాలని ఆయన చెప్పారు. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రపంచ వేదికలపై ఉగ్రవాద సమస్యపై చర్చించడం ద్వారా ఉగ్రవాద సంస్ధలకు నిధులు అందకుండా అడ్డుకోవాలన్నారు. విపక్ష పార్టీల సమావేశంలో వారు ఇచ్చిన సూచనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగీకరించారని అన్నారు. ఇదేవిధంగా దేశంలోని అన్ని పార్టీలు ఉగ్రవాద నిర్మూలనకు ఏకమైనప్పుడే సమస్య పరిష్కారమవుతుందని సిబాల్ పేర్కొన్నారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు. పాకిస్థాన్‌కు నిధులిస్తే వాటితో ఉగ్రవాదులను పోషిస్తుందని, కాబట్టి ఆ దేశానికి ఎలాంటి సాయం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ ఐఎంఎఫ్‌ను కోరారు.