– క్లియరెన్స్ అంత ఈజీ కాదు..
ఒకే దేశం… ఒకే ఎన్నిక బీజేపి చిరకాలపు లక్ష్యం సాకారానికి అడుగులు వేగంగా పడుతున్నాయా?తాజా సమాచారం ప్రకారం రేపు లోక్ సభలో జమిలి బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తున్నందున ఈ లోగా బిల్లును ప్రవేశ పెట్టి దానిని జేపీసీకి పంపేలా పావులు కదపడమే ఎన్డీఏ లక్ష్యంగా కనిపిస్తోంది.బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఏకాభిప్రాయ సాధన కోసం జేపీసీ వేస్తారు. దీనిలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు వారి వారి బలా బలాల ఆధారంగా చోటు ఉంటుంది. లోక్ సభలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ ఈ కమిటీకి ఛైర్మన్ అవుతారు. కాబట్టి బీజేపీ యే ఆ పదవిని స్వీకరిస్తుంది.కాబట్టి ఏకాభిప్రాయాన్ని కూడగట్టగలదన్నది ఒక అంచనా.. ఇప్పటి వరకూ జమిలి ఎన్నికల ప్రతిపాదనలను 32 పార్టీలు ఆమోదించగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి. అయితే ఆమోదించిన పార్టీలన్నీ శివసేన లాంటి చిన్నా, చితకా పార్టీలు కావడం, కాంగ్రెస్ త్రుణమూల్, డీఎంకే, లాంటి కీలకమైన విపక్షాలు వ్యతిరేకిస్తుండటంతో ఈ బిల్లు అంత సునాయాసంగా పార్లమెంటు ఆమోదం పొందే వీలులేదు. ఇండియా కూటమిలో ఎవరూ ఈ బిల్లును సమర్ధించడం లేదు.
మూడింటా రెండొంతుల మెజారిటీ
రాజ్యాంగ సవరణతో బిల్లును గట్టెక్కించాలి అంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ బిల్లును మూడింటా రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి.అంటే లొక్ సభలో బిల్ పాసవడానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా రాజ్యసభలో 167 మంది సభ్యుల మద్దతు అవసరం.దీనికి తోడు 14రాష్ట్రాలనుంచి ఈ బిల్లుకు మద్దతు రావాలి. 14 రాష్ట్రాల్లొ బీజేపి అధికారంలో ఉండటం వల్ల అది పెద్దకష్టం కాకపోవచ్చు.. కానీ పార్లమెంటులో ఈ బిల్లు గట్టెక్కడమే కీలకం.
బిల్లును ఎలా ఆమోదిస్తారు?
సాధారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాతే ఏ బిల్లయినా చట్ట రూపం దాల్చి అమలులోకి వచ్చేది.లోక్ సభలో ఈ బిల్లు ఎలాగోలా మిత్రుల సహ కారంతో గట్టెక్కించుకున్నా.. రాజ్యసభలో ఇది గట్టెక్కడం అంత సులభంకాదు. ఎందుకంటే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేదు.లోక్ సభ మొత్తం సీట్లు 543 కాగా అందులో ఎన్డీఏ మెజారిటీ 293 స్థానాలు. ఇందులో బీజేపి ఒక్క పార్టీకే సొంతంగా 240 స్థానాలున్నాయి. ఏ బిల్లు సభామోదం పొందాలన్నామూడింటా రెండొంతుల మెజారిటీ అవసరం. అంటే ఎన్డీఏకు జమిలి బిల్లు గట్టెక్కాలంటే అదనంగా 69 మంది సభ్యుల మద్దతు అనివార్యం అవుతుంది. అందుకే ఏకాభిప్రాయ సాధన ద్వారా బిల్లుకు ఆమోద ముద్ర పడేలా బీజేపి పావులు కదుపుతోంది.జేపీసీ ద్వారా అనుకూల వాతావరణం తెచ్చుకుని లోక్ సభలో బిల్లును పాస్ చేసినా.. రాజ్యసభలో ఈ బిల్లు గట్టెక్కడమే కీలకం. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా మూడింటా రెండొంతుల మెజారిటీకి 164 మంది మద్దతు అవసరం.కానీ రాజ్యసభలో ఎన్డీఏకి 130 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. కాగా ఇండియా కూటమికి 90 మంది ఎంపీలున్నారు. అయితే ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపి ఢాంకా బజాయించి గెలవడం ఆ పార్టీకి కొత్త ఊపిరి. తదనుగుణంగా రాజ్యసభ స్థానాలు కూడా పెరుగుతాయి. అంతేకాక ఇటీవల జరిగిన రాజ్య సభ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం గణనీయంగా పెరిగింది. మెజారిటీకి దగ్గరగా అటో ఇటో అయినా.. చివరి నిమిషంలో ఎలాగోలా బిల్లు గట్టెక్కించడానికి ప్రయత్నాలు చేయవచ్చు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేపి ఆలోచనా విధానమే అయినా.. ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపికి సొంతంగా మెజారిటీ లేదు. ఎన్డీఏ మిత్రుల సహకారం తప్పనిసరి. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దానిని ఒక కొలిక్కి తేవాలని భావిస్తుండొచ్చు. మిత్ర పక్షాల సహకారం సాధ్యం కాకపోతే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి మరోసారి బీజేపి పూర్తి స్థాయి లో మెజారిటీ సాధించి అప్పుడీ ప్రక్రియను అమలు చేయవచ్చు.కానీ మెజారిటీ రాష్ట్రాల్లో ఆ పార్టీ విజయం పొందాలంటే అది అంత సులభమైన విషయం కూడా కాదు.
స్థానిక సంస్థల ఎన్నికలను కూడా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో కలసి నిర్వహించడం ఉత్తమమని రామనాథ్ కోవింద్ కమిటీ సూచించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి సంక్లిష్టమైన ఆ ప్రక్రియను ఇందులో కలపక పోవచ్చు.
జమిలి ఎన్నికలపై పార్టీల అభిప్రాయాలను కోరినప్పుడు 47 పార్టీలనుంచి కేంద్రానికి స్పందన వచ్చింది. అందులో 32 పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్ధించాయి.కేవలం 15 పార్టీలు వ్యతిరేకించాయి. కానీ వ్యతిరేకించిన పార్టీలు ఓటుబ్యాంకు, సీట్లపరంగా బలమైనవి కాగా సమర్ధించిన 32 పార్టీలు ఎన్నికల్లోపెద్దగా ప్రభావం చూపలేనివే..ఈ ఇబ్బందుల రీత్యా జమిలి బిల్లుపై ఇప్పుడు చర్చకు తెర లేపి ..ఆపై ఓటింగ్ ద్వారా ఆమోదింప చేసుకోవడం , సాధ్యం కాకపోతే రెండేళ్లలో మధ్యంతరానికి వెళ్లి అప్పుడు పూర్తి స్థాయి మెజారిటీ తెచ్చుకుని బిల్లులను ఆమోదింప చేసుకుంటుందా? అన్నది చూడాలి