36.6 C
Hyderabad
Monday, June 15, 2026

Live Video

spot_img

లావొక్కింతయు వలదు…

  • డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఒబేసిటీ
  • 2050 నాటికి 44 కోట్ల మందికి డయాబెటీస్
  • ప్రతీ ముగ్గురిలో ఒకరికి డయాబెటిస్
  • వంటనూనెల వాడకం పది శాతం మించొద్దు
  • బేసిటీ డేంజర్ బెల్స్ పై ప్రధాని వార్నింగ్
  • యువతను కమ్మేస్తున్న ఒబేసిటీ ముప్పు
  • ముంద స్థూలకాయం.. ఆపై షుగర్ వ్యాధి

ఒబేసిటి…ఊబకాయం.. లేదా స్థూలకాయం.. ఈమధ్యకాలంలో అతిపెద్ద సమస్య. అది ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. వయసుకు సంబంధం లేకుండా మనిషి అపరిమితంగా లావెక్కి పోవడం, కొవ్వు ఎక్కువ చేరిపోవడం చివరకు డయాబెటిస్ అంటే చక్కెర వ్యాధికి కారణమవుతోంది. ఒక అంచనా ప్రకారం మన దేశంలో 2050 నాటికి 44 కోట్ల మంది డయాబెటిస్ రోగులుగా మారతారన్న లెక్కలు భయపెడు తున్నాయి. అంటే ప్రతీ ముగ్గురిలో ఒకరు డయాబెటిక్ రోగులవుతారు. అందుకే ప్రధాని మోడీ కూడా ఆందోళన వ్యక్తంచేశారు. వంట నూనె వాడకం పదిశాతానికి మించ కుండా చూసుకుంటూ వ్యాయామాలుచేయాలని కోరారు.

భయపెడుతున్న లెక్కలు..

అత్యాధునిక టెక్నాలజీ మధ్య రకరకాల షిప్టులలో చేస్తున్న పని ఉద్యోగులకు ఒబేసిటీ ముప్పుతప్పదు. హైటెక్ సిటీ ఏరియా లో ఉండే 80% మంది ఐటీ ఉద్యోగులు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇండియాలో 60% జనాభా అధిక బరువుతో ఉన్నారు. ఇందులో 30% మంది బాడీ ఫ్యాట్ ఎక్కువై ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంటున్నారు. అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే డయాబెటీస్ కు దారి తీస్తుంది.

అధిక బరువుకు కారణాలెన్నెన్నో..

ఏళ్ల తరబడి జంక్ ఫుడ్కు అలవాటు పడిపోవడం అధిక బరువుకు మొదటి కారణమని తెలుసుకోవాలి. చాలా మంది లావుగా ఉండటం, బొద్దుగా ఉండటం మంచిదే అనుకుని కొనసాగిపోతున్నారు. ఉరుకుల పరుగుల జీవితం రోజు వారీ టాస్క్ లను రీచ్ కావడం, పెరిగిన లైఫ్ స్టైల్, దానితో పెరుగుతున్న అలవాట్లు, సౌకర్యాలు, లగ్జరీ లైఫ్ డబ్బు సంపాదన అవసరాలను పెంచడం ఒక కారణమైతే.. దానికోసం అధిక షిఫ్టులు అదీ కంప్యూటర్లు, లాప్ టాప్ లు వాడటం వలన గంటల తరబడి ఒకే భంగిమలో ఉద్యోగాలకు అతుక్కు పోవడం రెండో కారణం. అధిక షిఫ్టుల్లో, సుదీర్ఘ సమయం పనిచేయడం, ప్రమోషన్లు, కెరీర్ గ్రోత్, కుటుంబ అవసరాలు, ఒంటికి శ్రమలేని కారు ప్రయాణాలు అన్నీ ఒబేసిటీకి రాచమార్గాలే. కంపెనీలు మారిన కొద్దీ, కష్టపడుతున్న కొద్దీ మనీ గ్రాఫ్ పెరుగుతుంది. దానికి తోడు ఈఎంఐల కల్చర్ తెచ్చిన డిమాండ్. ఇన్ స్టాల్ మెంట్లు కట్టేందుకు క్రెడిట్ కార్డులు, రకరకాల యాప్ ల సాయంతో డబ్బు ఖర్చు చేసి తిరిగి తీర్చడానికి ఓవర్ టైమ్ లు పని చేయాల్సి రావడం కూడా ఒక కారణమే. దీనికి తోడు మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా. పలానా వస్తువు కావాలంటే ఫలానాది కొనాలి. అది రెండు ప్యాకెట్లు కొంటే మనం కోరుకున్న వస్తువు దాదాపు ఫ్రీగా వస్తుందన్న ఆకర్షణీయ ప్రకటనలు కూడా అధిక బరువు కొని తెచ్చుకునే మార్గాలే. ప్రోసెస్డ్ ఫుడ్, రకరకాల క్యాండీలు, మిల్క్ షేక్ లు, పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, వెజ్, నాన్ వెజ్ టిఫిన్ ఐటెమ్స్, స్నాక్ ఐటెమ్స్ అన్నీ బరువు పెరిగేవే. కొలెస్ట్రాల్ పెంచే అలాంటి తిళ్లు, చిరుతిళ్లు మోతాదుకు మించి తింటుండటం ఒబేసిటీ పెరగడానికి కారణమవుతోంది. ఒబేసిటీని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ముప్పు డయాబెటీస్.

ఎందుకొస్తుంది?

మన శరీరంలో మోతాదుకు మించి తిన్నప్పుడు అధిక కెలొరీలు చేరతాయి. అధిక కొవ్వులు, ఎక్కువ తీపి పదార్ధాలు తిన్న తర్వాత చక్కెర ద్వారా చేరే ఆ కెలొరీలను కరిగించే సామర్ధ్యం లేక పోతే అది డయాబెటిస్ కు దారి తీస్తుంది. మన శరీరంలో పెద్ద మొత్తంలో కొవ్వు పేరుకుని అది గుండె జబ్బులు, కేన్సర్, పక్షవాతం లాంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది. నిద్రలేమి, ఫ్యాటీ లివర్, గాల్ బ్లాడర్ లో రాళ్లు, సంతాన రాహిత్యం లాంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒబేసిటీ వల్ల మానసిక అభద్రత, సమాజం చులకనగా చూడటం, ఆ తర్వాత మానసికమైన కుంగుబాటుకు కారణమవుతున్నాయి. ఇది స్థూల కాయాన్ని పెంచుతుంది.కొండలా పెరిగిపోతున్న శరీరాన్ని తగ్గించుకోడానికి మార్గాలే లేవా అంటే ఉన్నాయి. కానీ మనిషికి ముందు బరువు తగ్గాలన్న స్పృహ, చింతన, తిండి మీద కంట్రోల్ ఉండాలి. అప్పుడే దానిని జయించగలరు.

కొలమానం ఏంటి?

మన శరీరం చుట్టుకొలత అంటే బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ బరువు ఉన్నట్లే.. ఇక 30 దాటిందీ అంటే ఒబేస్ కింద లెక్క. 2019 లెక్కల ప్రకారం 50 లక్షల మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ BMI ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్న కేసులే.1990 నుంచి 2022 మధ్య ఈ రకమైన వ్యాధులతో బాధపడుతున్న వారు 5– నుంచి-19 ఏళ్ల మధ్య వయసు వారని గుర్తించారు. అగ్రదేశాలు, మధ్యతరగతి దేశాల్లో ఒబేసిటీ కేసులు వేగంగా పెరుగుతుంటే తూర్పుఆఫ్రికా దేశాల్లో దుర్భర దారిద్య్రంతో హీన పోషణకు గురవుతున్న వారి సంఖ్య ఇంతకు రెండింతలు ఉంది.

కొంపముంచే కొవ్వు

అధిక కొవ్వులు, అంటే శారీరక శ్రమతో, లేదా కృత్రిమంగా కరిగించుకోవడం మినహా గత్యంతరం లేని కొవ్వులు పెరుగుతుంటే మన శరీరంలో డేంజర్ బెల్ మోగుతోందని అర్ధం. అధిక బరువు అసాధారణ కొవ్వు నిల్వలు శరీరంలో చక్కెర నిక్షిప్త కేంద్రాలుగా మారిపోతాయి. ఏసీ రూములలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని కదలకుండా పనిచేసే హైఫై కల్చర్, తీరిక లేకపోవడంతో వ్యాయామం చేయలేక పోవడం స్థూల కాయానికి దారి తీస్తున్నాయి. నిర్ణీత వేళలు లేని పని శారీరక శ్రమ లేని పని లావెక్కడానికి దారి తీస్తుంది. జంక్ ఫుడ్ తిన్నప్పుడు అందులో కరగని కొవ్వులు అధికం.ఆ ఫుడ్ తయారీకి వాడే నూనెలు, నెయ్యి, డాల్డా ఇతర వస్తువులన్నీ కొవ్వును పెంచేవే. నిల్వ ఉండటానికి వేసే కలర్స్ అన్నీ బరువుకు కారణమే. రెడీ మేడ్ ఫుడ్ కి అలవాటు పడిన వారు ఆటోమేటిగ్గా ఒబేసిటీ వ్యక్తులుగా మారతారు. ఎక్కువ కాలం ఒబేసిటీ బాడీ వ్యాయామానికి దూరంగా ఉంటే ఇక సహజంగా కరిగే శక్తిని కోల్పోయి కరగని కొవ్వు ఏర్పడిపోయి మనిషి లావుకి దారి తీస్తుంది.

ఏం చేయాలి?

శరీరానికి కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వేగవంతమైన వ్యాయామం అవసరం. అప్పుడే మన రక్త నాళాల్లో చేరిన అధిక కొవ్వు కరుగుతుంది. నడకను ప్రతీరోజూ అలవాటు చేసుకుంటే సగం జబ్బులను నివారించినట్లే. ఉదయం పూట జాగింగ్, లేదా వేగంగా మార్నింగ్ వాక్ చేస్తున్నవారు క్రమేపీ ఒబేసిటీ కరిగి నాజూగ్గా తయారవుతారు. ఇది మొదటి రెండు దశల్లో మాత్రమే.

ఇవి తప్పనిసరి

పని ఒత్తిడి టార్గెట్లతో సతమతమయ్యే వారు కనీసం ప్రతీ అరగంటకు ఒకసారి లేచి ఒళ్లు విరుచుకోవడం, తలను అటూ ఇటూ తిప్పడం, కళ్లను గట్టిగా మూసి తెరవడం, కంటి గుడ్డును నాలుగు వైపులకు వేగంగా తిప్పడం లాంటి కంటి, ఒంటి వ్యాయామాలు చేయాలి. కంప్యూటర్ ను సరైన వెలుగు కు సెట్ చేసుకుని భుజ కండరాలు దెబ్బతినకుండా సరైన పొజిషన్లో కూర్చుని పనిచేసుకోవాలి. ప్రతీ గంటకు లేచి కాసేపు అటూ, ఇటూ నడవడం, గ్లాసు మంచి నీరు తాగడం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం. ఇది పాటించి జంక్ ఫుడ్కు దూరంగా ఉంటే ఒబేసిటీని జయించినట్లే. అంతేకాదు శరీరంలో ఎప్పుడూ కరిగే కొవ్వు అంటే సాల్యుబుల్ కొవ్వు పెరగొచ్చు కానీ.. అసంతృప్త కొవ్వులు లేదా కరగని కొవ్వులు చేరాయంటే ఇక మనం డేంజర్ జోన్ కు దగ్గరవుతున్నట్లే. కాబట్టి జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఒక వేళ గత్యంతరం లేక తీసుకోవాల్సి వస్తే పరిమితంగా తీసుకుని ఆ వారం విపరీత వ్యాయామాలు చేసి వాటిని కరిగించేసుకోవాలి.

జీవన శైలితో మారే ఒబేసిటీ

స్థూల కాయులు తాము బీఎంఐ లిమిట్ దాటుతున్నామన్న స్పృహతో ఉండి తీరాలి. ఆకు కూరలు, అధిక నీటి శాతం, లో కేలరీలు, అధిక న్యూటిషన్ విలువలు కలిగిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటి దగ్గర వ్యాయామం చేయలేని వారు ఖచ్చితంగా సమీపంలోని యోగా కేంద్రంలో చేరి తమ శరీరానికి, మనసుకు తగిన వ్యాయామం కల్పించుకుని ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపాలి. పాజిటివ్ ఆలోచనలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, క్రమ బద్ధమైన జీవన శైలి, పరిమితమైన పౌష్టికాహారం ఒబేసిటీ ముప్పు రాకుండా చేస్తాయి. జంక్ ఫుడ్ లేదా ఎక్కువ రుచి కరమైన ఆహారం తినాలని అనిపించినప్పుడు, పార్టీ టైముల్లో పరిమితులు, మోతాదులు, దాటి ఇతర జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఆ వారంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అది ఫ్యాటీ లివర్కు ఆ తర్వాత ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. జీవన శైలితో ఎర్లీ ఒబేసిటీ ముప్పును దాటేసి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే. కానీ ఈ జీవితానికి దూరంగా భిన్నమైన లైఫ్ స్టైల్ కొనసాగిస్తే మాత్రం మీ ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో పెట్టేసినట్లే. మందులు వాడుతూ ఆపరేషన్లు చేయించుకుంటూ ఇల్లు, ఒళ్లు గుల్లయిపోడమే. ఒకసారి డయాబెటిక్ గా మారారంటే మీరు మామూలు ఆరోగ్యానికి దూరమైపోయినట్లే. కాబట్టి ఒబేసిటీ కి దూరంగా ఉండండి. డయాబెటిస్ ముప్పు తప్పించుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com