- ఆపరేషన్ సింధూర్ దెబ్బకి మసూద్ కుటుంబం హతం
- మొత్తం 14 మంది మరణం..
- ఆర్మీ చర్యకు కకావికలైన జేషేమహమ్మద్ కేంద్రం
- వారు పుణ్యలోకాలకు వెళ్లారంటూ మసూద్ ప్రకటన
- భారత్ పై ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని శపథం
- మోడీ నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం..
మౌలానా మసూద్ అజార్.. 56 ఏళ్ల ఈ కరుడుగట్టిన తీవ్రవాదిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానించింది. మనదేశంలో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడి ఎంతోమందిఅమాయకుల ప్రాణాలు తీసేసిన మతోన్మాది. ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది చనిపోయారు. అజార్ కుటుంబం పదిమంది, మరో నలుగురు బంధువులు ఈ ఆపరేషన్ లో నేలకొరిగారు. ఈ వార్తని అజార్ కూడా థృవీకరించాడు.
మసూద్ భారత్ పై చేసిన దాడులు ఇన్నీ అన్నీ కావు.. కశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో అస్థిరతను రాజేసిన మతోన్మాది.. 1994లో ఎయిర్ ఇండియా ఐసీ814 హైజాక్ కి మూలకారకుడు మసూద్ అజారే.. అనేక కేసుల్లో అరెస్టయి జైల్లో మగ్గుతున్న అతగాడిని విడుదల చేయించడానికే అప్పట్లో కాందహార్ విమానం హైజాక్ ఘటన జరిగింది. మన ప్రయాణీకులను సురక్షితంగా వెనక్కు రప్పించుకోడానికి మసూద్ అజార్ ను అతిధి మర్యాదలతో మన రక్షణ మంత్రి జస్వంత్ సింగ్ పాకిస్థాన్ కు ప్రత్యేక విమానంలో తోడ్కొని వెళ్లి వారికి అప్పగించాల్సి వచ్చింది. మసూద్ అతిపెద్ద మాస్టర్ మైండ్.. ఆతని శిక్షణలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థే జైషే మహమ్మద్.. బహావల్పూర్ లో ఉన్న జామియా మస్జిద్ సుభానల్లాపేరుతో ఉన్న ఉగ్రవాద శిక్షణా కేంద్రమది.
తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం…
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈ ఉగ్ర సంస్థ శిబిరాన్ని భారత దళాలు నేలమట్టం చేశాయి. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబం మొత్తం చనిపోయింది. పెద్ద సోదరి, బావ,మేనల్లుడు, భార్య, మేనకోడలు, రెండో భార్య సంతానం అయిన ఐదుగురు పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలొదిలారు.
విచారం లేదు.. నిర్వేదం లేదు..
మొత్తం పదిమంది ఈ దాడుల్లో చనిపోయారని అభంశుభం తెలియని తన అమాయక సంతానం, ఇతర బంధువర్గం ప్రాణాలోదిలారని వారందరూ సుఖంగా పుణ్య లోకాలకు చేరుకున్నారని అజార్ కామెంట్ చేశాడు. వారిప్పుడు అల్లా అతిథులని కీర్తించాడు. విచారం లేదు.. నిర్వేదం లేదు.తాను కూడా వారితో కలసి స్వర్గానికెళ్లాలని భావిస్తున్నట్లు మసూద్ తెలిపాడు.వారి వీడ్కోలుకు సమయం ఆసన్నమైందని,ఇది భగవంతుడు వేసిన శిక్షకాదని అజార్ అన్నాడు. వారి అంత్యక్రియలకు తరలి రావాల్సిందిగా తన అనుచరులకు పిలుపు కూడా పెట్టాడు.పై లోకంలో వారు అల్లా దగ్గర సుఖశాంతులతో ఉంటారని అన్నాడు. ప్రధాని మోడీ కనీస నియమాలను ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడ్డారని భారత్ పై ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాడు.
భారత్ పై దాడుల సూత్రధారి
మసూద్ అజార్ ట్రాక్ రికార్డు చాలా పెద్దది.. 2001లో జరిపిన పార్లమెంటుపై దాడి నుంచి 2008ముంబై దాడులు,2016 పఠాన్ కోట్ దాడులు,2019 ఫుల్వామా దాడి వరకూ అన్ని ఘటనల వెనుకా ఇతగాడి హస్తం ఉంది.పాకిస్థాన్ లోనే మసూద్ తలదాచుకున్నా.. ఆదేశం మాత్రం తమ దగ్గర లేడంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చింది.
మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిపిన ఆపరేషన్ సింధూర్ లో 70 మంది ఉగ్రవాదులు చనిపోగా మరో 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో కొందరు అమాయకులు కూడా ప్రాణాలొదలడంపై భారత్ విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాదులు వారిపై దాడి చేసే వీలు లేకుండా జనావాసాల మధ్యే స్థావరాలు ఏర్పరచుకున్నారని దాంతో ఆపరేషన్ లో ప్రాణనష్టం తప్పలేదని భారతీయ ఆర్మీ ప్రకటించింది. ప్రాణనష్టం పరిమితంగా ఉండాలనే మన ఆర్మీ అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించగా, పాకిస్థాన్ మాత్రం అమాయక పౌరులపై దాడి చేసినట్లుగా అంతర్జాతీయ దేశాల ముందు ప్రచారం చేసుకుంటోంది.