ఏపి రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు సీఆర్డీఏ, ఏడీసీ సన్నద్ధం అవుతున్నాయి. పలు పనులకు ఇవి టెండర్లు పిలిచాయి. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సన్నాహకంగా పలు మార్గాల్లో ప్రత్యామ్నాయ మార్గాల కోసం సీఆర్డీఏ తాత్కాలిక రోడ్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మూడు బీటీ రోడ్లను నిర్మించింది. పనులు ప్రారంభమైతే ఆయా సంస్థల వాహనాలు.. నిర్మాణ సామగ్రి చేరవేసేందుకు ఈ దారులు అక్కరకు రానున్నాయి. కరకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ పనులు ప్రారంభమైతే.. ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
మూడు తాత్కాలిక రోడ్లు పూర్తి…
ఉండవల్లి గుహలు ఎదురుగా కరకట్టకు వెళ్లే మార్గాన్ని వెడల్పు చేసి బీటీ వేశారు. ఇది సీఎం చంద్రబాబు నివాసం దాటి.. నేరుగా కరకట్ట వరకు వెళ్తుంది. మంతెన ఆశ్రమం సమీపంలో కరకట్ట దిగువ నుంచి మరో మార్గాన్ని ఈ3 రోడ్డుకు అనుసంధానించారు. కరకట్ట వెంట పొలాల నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు ఇంకో రోడ్డును వేశారు. వీటిని తాత్కాలికంగా వేశారు. పనులు పూర్తయి, అవసరాలు తీరాక వీటిని లే ఔట్లు వేసేటప్పుడు తొలగిస్తారు. తర్వాత అవసరాల మేరకు మరికొన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు.
విజయవాడ నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రస్తుతం వాడుతున్న కరకట్ట రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఇప్పటికే రూపొందించిన నమూనాలను మారుస్తున్నారు. నదికి గరిష్ఠ వరద వచ్చినా తట్టుకునేలా డిజైన్లను రూపొందిస్తున్నారు. సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)ను ప్రభుత్వం సంప్రదించి నమూనాను తిరిగి తయారు చేయిస్తోంది. ఈ ప్రక్రియ పది రోజుల్లో కొలిక్కి వచ్చే వీలుంది. తర్వాత టెండర్లు పిలవనున్నారు. సుమారు రూ.800 కోట్లు అవుతుందని అంచనా. త్వరలో ఇవి కొలిక్కి వచ్చే వీలుంది.
విడతల వారీగా విస్తరణ..
ఒకే వరుసతో ఈ మార్గం విస్తరణకు నోచుకోక.. నిత్యం వాహనదారులకు అవస్థలే. ఇటుగా విజయవాడ నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లేందుకు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. రద్దీ నేపథ్యంలో సాయంత్రం పూట ఉండవల్లి నుంచి అమరావతి వైపు వెళ్లే వాహనాలను కరకట్టపైకి అనుమతించడం లేదు. వన్‌వే నిబంధన అమలు చేస్తున్నారు. కరకట్టపై వాహన రద్దీ ఎక్కువగా ఉన్నందున.. విస్తరణ పనులు మొదలైతే ప్రత్యామ్నాయ రోడ్లలోకి ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ట్రాఫిక్ దృష్ట్యా విడతల వారీగా విస్తరణ పనులు చేపడతారు. ప్రతి నాలుగు కిలోమీటర్లను ఒక బిట్‌గా విభజించి పూర్తి ఆ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను ఈ రోడ్లపైకి పంపుతారు. అలా కరకట్ట రోడ్డు విస్తరించే వేళ వీటిని ఉపయోగించనున్నారు.