– బీఆర్‌ఎస్‌లోనే కొనసాగే ఆలోచన
– ఏడాదిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
– అనర్హత వేటు పడితే మళ్లీ గెలవడం కష్టం
– రేవంత్ ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆక్రోశం
– అసెంబ్లీలో తిట్టి.. కేటీఆర్‌ను కలిసి సారీ
– ఫార్ములా ఈ-రేస్‌పై కేటీఆర్ అనుకూల వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ షాక్ ఇవ్వబోతున్నారా? దాదాపు యేడాది కాలం నుంచి కాంగ్రెస్‌తో అంటకాగుతున్న దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారా? గత కొంత కాలంగా దానం నాగేందర్ వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? సీఎం రేవంత్‌కు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారా? ఇప్పుడీ చర్చ తెలంగాణలో ఆసక్తికరంగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలుపొందారు. అయితే, బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కాంగ్రెస్‌పార్టీకి దగ్గరయ్యారు. అధికారికంగా కాంగ్రెస్‌పార్టీలో చేరకున్నా.. అధికారపార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటూ వచ్చారు. అంతేకాదు.. సాక్షాత్తూ అసెంబ్లీలోనే బీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో దూషణలకు పాల్పడ్డారు. దీంతో, ఇక దానం నాగేందర్ కాంగ్రెస్‌పార్టీలో చేరినట్లే అని అందరూ అనుకున్నారు.
అయితే, గత కొంత కాలంగా దానం నాగేందర్ సైలెంట్‌గా ఉంటున్నారు. సైలెంట్‌గా ఉంటే పర్లేదు గానీ.. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యల తర్వాత కేటీఆర్‌ను స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పానంటూ ఓ ఇంటర్‌వ్యూలో వ్యాఖ్యానించారు. అదీ కాకుండా.. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో హీట్ పుట్టిస్తోన్న ఫార్ములా ఈ-రేస్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేదంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఆ దిశగానే ఫార్ములా ఈ-రేసును హైదరాబాద్‌కు తెచ్చారని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న అత్యంత కీలక సమయంలో అసలు ఆ ఫార్ములా కేసులో అవినీతే లేదని.. హైదరాబాద్ బ్రాండ్ ను పెంచేలా కేటీఆర్ వ్యవహరించారని దానం తెలిపారు. ఈ పరిణామం ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పూర్తిగా ఆత్మరక్షణలో పడేసిందనే అభిప్రాయం కలుగుతోంది. అసలు ఈ కేసులో కాంగ్రెస్‌పార్టీ సీరియస్‌గా ముందుకెళ్తున్నసమయంలో, ఏసీబీతో పాటు.. ఈడీ కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితుల్లో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న కేటీఆర్.. ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అటు..ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఓవైపు ఆ పరిణామాలు హీట్ పుట్టిస్తుండగా.. మరోవైపు.. ఓ డిజిటల్ ఛానెల్‌కు దానం నాగేందర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పూర్తిగా కేటీఆర్‌కు అనుకూలంగా మాట్లాడారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డికి పంటికింద రాయిలా మారింది.
అయితే, గత కొంత కాలంగా రేవంత్‌రెడ్డి తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని దానం నాగేందర్ అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓరకంగా తనను అవమానిస్తున్నట్లు దానం నాగేందర్ ఫీలవుతున్నారట. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షరతు విధించినట్లు సమాచారం. మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలామందికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి పదవికి రాజీనామా చేయకపోవడమే కారణమంటున్నారు. అయితే, తాను ఇప్పుడు పదవికి రాజీనామా చేస్తే తిరిగి గెలవడం కష్టమన్న ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా యేడాదిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్‌లో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారన్న క్లారిటీ లేకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తనముద్ర వేసుకోవడం కష్టమని భావిస్తున్నారు. అందుకే తాను గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగేందుకు దానం నాగేందర్ ఫిక్స్ అయ్యాడని చెబుతున్నారు.
అయితే, కీలక సమయంలో కాంగ్రెస్‌పార్టీకి, సీఎం రేవంత్‌కు దానం నాగేందర్ గట్టి దెబ్బ కొట్టాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఛానల్ లో కూడా వ్యూహాత్మకంగానే దానం నాగేందర్ ఇంటర్వ్యూకు ప్లాన్ చేశాడంటున్నారు. పాపులర్ న్యూస్ చానల్స్ అయితే.. సీఎం రేవంత్‌కు ముందే సమాచారం వెళుతుందని అనుమానించిన దానం నాగేందర్.. డిజిటల్ మీడియా ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.