- 230మందిని ఆస్పత్రులకు తరలింపు
- బాదాల్ చుట్టు పక్కల కంటైన్‌మెంట్ జోన్ గా ప్రకటన
- అక్కడి వారినందరినీ క్వారంటైన్ కు పంపిన అధికారులు
- డాక్టర్లకు శెలవులు రద్దు… అదనంగా 30 మంది వైద్యుల టీమ్
- బాధితులను ఆస్పత్రులకు ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- వారి రక్త నమూనాల్లో పెద్ద మొత్తంలో కాడ్మియం నిల్వలు
- ఎలా వచ్చాయన్న అంశంపై దర్యాప్తు
- కాడ్మియం పీలిస్తే బ్రెయిన్, నాడీ వ్యవస్థకు దెబ్బ
- నేర కోణంలో 50 మందిని ప్రశ్నించిన పోలీసులు
జమ్ముకశ్మీర్‌లో అంతుచిక్కని వ్యాధి ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఒకేసారి 17 మంది మరణించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాజౌరీ ఏరియాలోని వ్యాధి పీడిత గ్రామాలన్నింటినీ కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించింది. ఈ మిస్టరీ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం కూడా ఆందోళన పడుతున్నారు. ఆస్పత్రుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్లందరికీ ఇప్పటికే లీవులు రద్దు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వ్యాధి ఏ వైరస్ వల్లగానీ, బాక్టీరియా వల్లకానీ, వచ్చినది కాదని వైద్య నిపుణులు తేల్చారు. మిస్టరీ మరణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ రాజౌరీ జిల్లాలోని బాదాల్ చుట్టు పక్కల గ్రామాలను పీడిస్తున్న ఈ వ్యాధి వల్ల ఇప్పటి వరకూ 17 మంది మరణించగా 230 మంది క్వారంటైన్ జోన్ లో ఉన్నారు. ఈ ప్రాంతానికి మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
లక్నో ల్యాబ్ కు వీరి నమూనాలు…
వ్యాధిబారిన పడినవారి శరీరంలోని అవశేషాలను లక్నోలోని ల్యాబ్‌కు పంపారు. అయితే ఇదేమీ వైరస్ వల్ల లేదా ఇన్ఫెక్షన్ వల్ల, లేదా బాక్టీరియావల్ల వచ్చిన వ్యాధి కాదని వారి శరీరాల్లో టాక్సిన్స్ అసాధారణ రీతిలో పేరుకుపోయి ఉండటాన్ని గుర్తించామని ల్యాబ్ టెక్నీషియన్లు తెలిపారు.
యంత్రాంగం అప్రమత్తం…
బాదాల్ గ్రామంలో మూడు వేర్వేరు కుటుంబాలకు చెందిన 17 మంది కేవలం నెలన్నర వ్యధిలోనే మరణించారు. మరికొంత మంది విపరీతమైన నీరసం, రకరకాల లక్షణాలతో తీవ్ర అవస్తలు పడుతున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది చనిపోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం డాక్టర్లకు శీతాకాల శెలవులు, సాధారణ శెలవులు కూడా రద్దు చేసింది. ఆస్పత్రులన్నీ బాధితులతో నిండుతున్నాయి. రాజౌరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అదనంగా 30 మంది వైద్యవిద్యార్ధులను డెప్యుటేషన్ పై పంపారు.ఎమర్జెన్సీపరిస్థితులను డీల్ చేయడానికి వైద్యపరంగా ఏర్పాట్లు కూడా చేశారు.
బాధితుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో జమ్మూలోని, చండీగఢ్ లోని ఆస్పత్రులకు ఎయిర్ లిఫ్ట్ చేశారు.వారిని అబ్జర్వేషన్ లో ఉంచినట్లు కొంత సమయం గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.మరి కొందరిని సమీపంలోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. బాధితులను కలసిన బంధువులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. మరికొందరు బంధువులను, స్నేహితులు, పరిచయస్తులను కూడా రాజౌరీ నర్సింగ్ కాలేజీలోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. నర్సింగ్ కాలేజీ దగ్గర భద్రత కట్టు దిట్టం చేశారు. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు.
బాధితుల శరీరాల్లో అసాధారణ మోతాదులో కాడ్మియం నిల్వలు…
బాధితుల రక్తనమూనాలను పరిశీలించగా అందులో ఇన్‌ఫెక్షన్ గానీ, బాక్టీరియాగానీ, వైరస్ గాని కనిపించలేదని వారి శరీరాల్లో పెద్ద మొత్తంలో టాక్సిన్ (విష వ్యర్ధాలు) ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో గుర్తించామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ తెలిపారు.
మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అందులో ( 13 మంది చిన్న పిల్లలు) నెలన్నర వ్యవధిలో చనిపోవడంతో బాదాల్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరికొందరు తీవ్ర అనారోగ్యం బారిన పడటం కూడా అనుమానాలుకు తావిచ్చింది. ఏమైనా అంటువ్యాధా, కొత్త వైరసా అన్న అనుమానాలు మొదట కలిగాయి. లేదా ఎవరైనా విష ప్రయోగం చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. బాధితుల సంఖ్య రోజురోజుకూపెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై వారిని ఆస్పత్రులకు తరలించి, ఆ గ్రామ పరిసరాలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించింది.
కాడ్మియం ఎలా వచ్చింది?
బాధితుల శరీరాల్లో అసాధారణ మొత్తంలో కాడ్మియం నిల్వలు పేరుకు పోయి ఉండటంతో ఏం జరిగిందా అన్నది అర్ధం కావడం లేదు. సాధారణంగా భూమి పై పొరల్లో కాడ్మియం నిక్షిప్తమై ఉంటుంది. దీనిని తవ్వితే వెలువడే రేడియేషన్, ఇతర కారణాల వల్లక కాడ్మియం మనిషిలోకి చేరుతుంది. గాలి పీల్చినప్పుడు, ఆ నీటిని తాగినప్పుడు కాడ్మియం అవశేషాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి. పెద్ద మొత్తంలో చేరితే ఊపిరితిత్తులు పాడవడం, లివర్, కిడ్నీలు చెడిపోవడం జరుగుతుంది. అంతేకాదు క్రమంగా శరీరంలో నాడీ వ్యవస్థ పైకూడా ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులైన కేన్సర్ లాంటి రోగాలకూ, బ్రెయిన్ చెడిపోడానికి, నాడీ వ్యవస్థ దెబ్బ తినడానికీ కాడ్మియం నిల్వలు కారణమవుతాయి.
అయితే ఈ కాడ్మియం వీరి శరీరాల్లోకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఏదైనా మైనింగ్ జరిపి ఎవరైనా తవ్వకాలు చేపట్టారా అన్నది తెలియరాలేదు, ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేసులో నేరకోణం ఉందేమోనన్న అనుమానంతో ఇప్పటికే 50 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.