27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

మనమిత్రలో ఇకపై మరిన్ని సేవలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాట పట్టిందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ, దేశీయ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. వారికి అవసరమైన అనుమతులు, సౌకర్యాలు తక్కువ సమయంలో అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించేందుకు రూపొందించిన “మన మిత్ర” యాప్ ద్వారా ప్రస్తుతం 317 రకాల సేవలు లభిస్తున్నాయని లోకేష్‌ తెలిపారు. ఈ సంఖ్యను మే నెలాఖరునాటికి 400కి పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ శాఖ నుంచి భూరికార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, జన్మ మరణ ధ్రువీకరణ పత్రాలు, పంట నష్టం అంచనా, భూమి మార్పిడికి సంబంధించిన సమాచారం, ఐ-పట్టా పాస్‌బుక్‌ల వంటి సేవలు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి హామీ పథకం దరఖాస్తులు, నీటి సరఫరా, పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు, పన్నుల చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు, వీధిదీపాల నిర్వహణకు సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పట్టణాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, వ్యాపార లైసెన్స్ దరఖాస్తులు, పారిశుద్ధ్య సంబంధిత ఫిర్యాదులు, వీధిదీపాల నిర్వహణ సేవలు లభిస్తాయి. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఉన్నత విద్య, ప్రభుత్వ విద్యా సంస్థల సమాచారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, వైద్య శిబిరాలు, టీకాల వివరాలు, ఆరోగ్య పథకాలు, రక్త నిధి కేంద్రాల సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంది. ఆర్టీసీ బస్సుల సమయాలు, టికెట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, పన్నుల చెల్లింపు వంటి రవాణా శాఖ సేవలూ లభ్యమవుతున్నాయి.

ఇతర విభాగాల్లో పోలీస్ శాఖ ఫిర్యాదులు, విపత్తు నిర్వహణ సమాచారం, సామాజిక సంక్షేమ పథకాలు, వ్యవసాయ శాఖ సమాచారంతో పాటు విద్యుత్ శాఖ ఫిర్యాదులు, బిల్లుల చెల్లింపులు వంటి సేవలు కూడా “మన మిత్ర” వాట్సాప్ యాప్ ద్వారా ప్రజలకు సమర్ధంగా అందుతున్నాయని మంత్రి వెల్లడించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com