తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు బీజేపీ గెలుచుకోవడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది పార్టీ సమిష్టి విజయమన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇకనుంచి.. ఆ బాధ్యతతో పని చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పార్టీ కోసం కాదని.. ప్రజల కోసం అవసరమన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రాకపోతే చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లో కీలకమైన మేధావులు, విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. రాష్ట్రంలో ఓటర్లు ఏ మార్పు రావాలని కోరుకున్నారో.. ఆ మార్పు రాలేదని, కేవలం పాలకులు మాత్రమే మారారని.. ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. బిజేపి రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా పోటీ కోసం కాదని.. అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ ఏం మాట్లాడినా జనం పట్టించుకోరన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో.. ఈ ఎన్నికలతో అర్ధం అయిందన్నారు.