ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ కలిసిపోయాయి. కొత్తగా ‘జియో హాట్ స్టార్’ పేరుతో అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈమేరకు విలీన ప్రక్రియ పూర్తయ్యింది. ఈ రెండు సంస్థలు కలిసి ‘జియోస్టార్’ అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో, ఇవాల్టినుంచే జియో హాట్ స్టార్ ఓటీటీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఒకే వేదికపైకి చేరడంతో జియో హాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మారింది.
రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విలీనం కావడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలో కంటెంట్ అంతా ఒకే ప్లాట్‌ఫామ్‌పై చూడొచ్చు. ఇప్పటికే జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యూజర్లు తమ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించుకునే అవకాశం కల్పించారు. అలాగే, కొత్తగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చని వెల్లడించారు. జియో హాట్ స్టార్‌లో వంద లైవ్ టీవీ ఛానెళ్లు, 3 లక్షల గంటలకు పైగా ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అందుబాటులో ఉంటాయి. దీంతో, భారత మార్కెట్లోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్‌గా జియో హాట్ స్టార్ నిలిచింది. ఒరిజినల్ కంటెంట్‌తో పాటు డిస్నీ, ఎన్‌బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీఐ, పారామౌంట్ వంటి సంస్థలకు సంబంధించిన అంతర్జాతీయ కంటెంట్ కూడా ఈ కొత్త జియో హాట్ స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఇక, ఐపీఎల్ సహా భారత్‌లోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులన్నీ జియో సినిమాకు ఉన్నాయి. అన్ని ఐసీసీ టోర్నమెంట్స్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు ఉన్నాయి. దీంతో, ఇకనుంచి అన్ని మ్యాచ్‌లను జియో హాట్ స్టార్‌లో చూసేందుకు వీక్షకులకు వీలు కలుగుతుంది.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ కొత్త లోగోతో జియో హాట్‌స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతానికైతే ఈ కొత్త యాప్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యూజర్ ఇంటర్‌ఫేస్‌నే కలిగి ఉంది. కానీ, భవిష్యత్తులో ఇది మారవచ్చంటున్నారు. హాట్‌స్టార్ డాట్‌కామ్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. జియో సినిమాకు సంబంధించిన కంటెంట్ ఇప్పుడు జియో హాట్ స్టార్‌లో లో అందుబాటులో ఉందనే మెస్సేజ్ కనిపిస్తోంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా – సీసీఐ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ – ఎన్‌సీఎల్‌టీ గత ఏడాది ఆగస్టులో డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య విలీనానికి ఆమోదం తెలిపాయి. ఈ కొత్త కంపెనీలో రిలయన్స్‌కు ప్రత్యక్షంగా 16శాతం వాటా, వయాకామ్ 18 మీడియా బిజినెస్ ద్వారా 47శాతం వాటా దక్కించుకుంటే.. డిస్నీకి 37శాతం వాటా దక్కింది.