జనసేన పార్టీ ఆవిర్భవించి దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది. పదకొండో యేడులోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈనెల 14వ తేదీన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామి కావడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ ఉత్సవాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఈ ఆవిర్భావ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇదే సందర్భంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్లి కార్యకర్తలను, పార్టీ నాయకులను ఆవిర్భావ దినోత్సవాలకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటిదాకా జరిగిన ఆవిర్భావ దినోత్సవాలు ఒక ఎత్తు.. ఇప్పుడు జరగుఉతున్న వేడుకలు మరో ఎత్తు అని పార్టీ వర్గాలకు సంకేతాలు ఇస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆవిర్భావ దినోత్సవ సభలు నిర్వహించారు. కానీ, ఇప్పుడు వేరు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి హోదాలో ఈ ఆవిర్భావ వేడుకలు నిర్వహించబోతున్నారు. తనని 70 వేల ఓట్లకు పైగా మెజారిటీ తో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా పిఠాపురంలోనే ఈ ఉత్సవాలను నిర్వహించడం అందరి దృష్టిని అటువైపు మరల్చేలా చేసింది. ఈ ఆవిర్భావ సభకు దాదాపు ఆరు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ ఫాలోవర్లు హాజరు అయ్యే అవకాశాలు ఉండడంతో ఏర్పాట్లు కూడా వచ్చే వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈనెల 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఇదంతా పక్కన పెడితే ఒక భారీ విజయం తర్వాత జరుపుకుంటున్న పెద్ద పండుగ కావడంతో, ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతుందన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కల్యాణ్ సోదరులు చిరంజీవి, నాగబాబుతో పాటు.. మెగా ఫ్యామిలీకి చెందిన ముఖ్యులు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్ వంటి వారు కూడా ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా కాలం నుండి సోసల్ మీడియాలో మెగా, అల్లు కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, తామంతా ఒక్కటే అని చాటి చెప్పేందుకు ఈ ఉత్సవాన్ని ఒక వేదికగా చేసుకోబోతున్నారని.. అల్లు ఫ్యామిలీ ఈ ఈవెంట్ కి హాజరు అవుతుందని సమాచారం. అంతే కాదు.. అల్లు అర్జున్‌కి అత్యంత ఆప్తుడైన బన్నీ వాసు మార్చి 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోషల్ మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన పాలకొల్లుకి సంబంధించిన అనేక మందిని జనసేన పార్టీ లో నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేర్పించారు. దీంతో ఈ సభకు అల్లు ఫ్యామిలీ హాజరవుతోందనే టాక్ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది.