కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మీసాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణంతోపాటు రథోత్సవంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
అయితే మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని సంప్రదాయం సుందరగిరిలో ఉంది. స్వామి వారి కళ్యాణం జరిగిన తర్వాత గ్రామంలో రథోత్సవం నిర్వహిస్తారు.
వెంకటేశ్వరస్వామి రథోత్సవం జరుగుతుంటే ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా భక్తులు కోళ్లు, మేకలు బలి ఇస్తూ మొక్కులు తీర్చుకుంటారు. మీసాల వెంకన్నను వేడుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఈ ప్రాంతంలో ప్రబలంగా నమ్ముతారు.
మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. వేంకటేశ్వర స్వామిని మాంసాహారంతో ఆరాధించటం తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేదని…ఈ ఆచారం సుందరగిరిలోనే ఉందని స్థానికులు చెపుతున్నారు.