భారతదేశ గతిని, గమనాన్ని కూడా మార్చిన శక్తివంతమైన నాయకుడు దివంగత మన్మోహన్‌సింగ్ అని పలువురు విపక్షాల నాయకులు ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మాన సమావేశంలో పలువురు మాట్లాడారు. నిజాయతీ, నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్ అని తెలిపారు.
దేశానికి మన్మోహన్ చేసిన సేవలను ప్రజలు ఎన్నడూ మర్చిపోలేరని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అందుకే ఆయన స్మారకచిహ్నం న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు.
దేశానికి దశదిశ చూపించిన మన్మోహన్ సింగ్ పేద కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు కొనియాడారు. శాసన మండలిలోనూ మన్మోహన్ కు నివాళి అర్పిస్తే బాగుండేదన్నారు. మాతృదేశం కోసం ఎన్నో అవకాశాలు వదులుకున్నారని తెలిపారు. మన్మోహన్ ను దేశ రాజకీయాల్లోకి తెచ్చింది పీవీ అని అన్నారు. పీవీ నమ్మకాన్ని మన్మోహన్ వమ్ము చేయలేదన్నారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ప్రసంగం అత్యుత్తమమని కొనియాడారు. హైదరాబాద్ లో స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలన్నారు హరీశ్.
దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఏ దేశం కూడా అండగా నిలవని కాలంలో ఆర్థిక పగ్గాలు చేపట్టిన మన్మోహన్‌సింగ్ ఆ తర్వాత కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన్మోహన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల కారణంగానే ఇప్పుడు దేశం విశ్వగురు కాబోతోందన్నారు. ఆయన ఆరోజు తీసుకున్న నిర్ణయాల వల్లే ఐటీ రంగం అభివృద్ధిచెందిందని, పారిశ్రామిక రంగం పురోగతి సాధించిందన్నారు.