28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

‘మహా‘ విజయం… జమిలికి మార్గం…

మహరాష్ట్రలో మహాయతి కూటమి అందుకున్న అపూర్వ విజయం దేశాన్ని జమిలి ఎన్నికల వైపు నడిపిస్తుందా… బీజేపీ కేంద్ర నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో త్వరలో జమిలి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుందా… అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక దేశం ఒకే ఎన్నిక సిద్దాంతంతో పార్లమెంటుతో పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఏకకాలంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలనేది భారతీయ జనతా పార్టీ సిద్దాంతం. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనేక వేదికలపై బీజేపీ చర్చిస్తూనే ఉంది. 2024 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి పూర్వం కూడా బీజేపీ దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి పలు ప్రయత్నాలు చేసింది. అయితే ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో 2024 ఎన్నికల్లో అనుకున్నట్లుగా జమిలి ఎన్నికలు నిర్వహించలేకపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన హర్యానా, మహరాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా ప్రకటితమవ్వడంతో ఇక బీజేపీ కేంద్ర నాయకత్వం జమిలి ఎన్నికలపై దృష్టి పెడుతుందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

మహరాష్ట్ర ఊహకందని విజయం భారతీయ జనతా పార్టీలో మంచి జోష్ ని నింపిందనడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడంతో డీలా పడ్డ బీజేపీ హర్యానా, మహరాష్ట్రల్లో వరుస విజయాలు సాధించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న నరేంద్రమోడీ అయిష్టంగానే కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఈ కారణగాంగా ఏ క్షణమైనా కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళతారనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపించాయి. మరో పక్క బీజేపీ సిద్దాంతమైన జమిలి ఎన్నికలకు కార్యరూపం ఇవ్వడం ద్వారా 2027లో ప్రస్తుత లోక్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళతారని కూడా ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత జమిలి ఎన్నికలపై నిర్ణయం ఉంటుందని కూడా ఢిల్లీ వర్గాలు ప్రచారం చేశాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలపై కొంత కసరత్తు కూడా చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఇందుకు ఒప్పించినట్లు సమాచారం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టి మార్గం సుగమం చేస్తారనే సమాచారం వస్తోంది.

ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంతో బీజేపీ తన మధ్యంతర ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుందని రాజకీయ పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు కసరత్తు పూర్తి చేసి 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటుగా దేశం మొత్తాన్ని ఎన్నికలకు తీసుకువెళ్ళాలనేది బీజేపీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కీలక భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్(యు)లను కూడా జమిలి ఎన్నికలకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదేవిషయం టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జమిలి ఎన్నికలకు రెడీగా ఉండమి తమ నాయకులను సమాయత్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద మహారాష్ట్రలో మహాయతి కూటమి అఖండ విజయం జమిలి ఎన్నికలకు మార్గం సుగమం చేసినట్లైందని రాకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com