మహారాష్ట్ర తాత్కాలిక సీఎం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో థానేలోని జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించాలని వైద్యులు సూచించారు. వారం రోజులుగా షిండే ఆరోగ్యం బాగుండటం లేదు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీసే ఖాయంగా తెలిసింది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
డిసెంబర్ 5న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని సదరు వర్గాలు స్పష్టం చేశాయి. కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ల ప్రమాణ స్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే సేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీసే తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇందుకు షిండే వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ కారణంగానే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు ఏక్‌నాథ్ షిండే కుమారుడు కళ్యాణ్ ఎంపి శ్రీకాంత్ షిండేకు ఉపముఖ్యమంత్రి పదవి అని, కేంద్రంలో మంత్రిపదవి అని పలు విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో షిండే అనారోగ్యం పాలు కావటం శివసేన నేతలను కలవరపరుస్తోంది. ఈ రోజు రాత్రి కల్లా మహారాష్ట్రలో పొత్తులు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని విశ్లషకులు భావిస్తున్నారు.