పాకిస్తాన్‌కు సైనిక రహస్యాలు చేరవేసిందన్న ఆరోపణలపై ఆరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ హై కమిషన్‌లో పనిచేసే ఉద్యోగితో పరిచయమైనప్పటినుంచీ ఆమె జీవితం, ఆలోచనలు మలుపు తిరిగాయని విచారణాధికారులు గుర్తించారు. లవ్ జిహాద్‌కు చిక్కి ఆపై గూఢచర్యానికి పాల్పడిందని అంచనాకు వచ్చారు.
హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా, ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువతి. 2018లో ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ విశేషాలను తనదైన ప్రత్యేక శైలిలో వీడియోలుగా ప్రజలకి అందించింది. ఆమెకి ఉన్న ఆకర్షణీయమైన వ్యాఖ్యాన శైలి, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌తో రూపొందించిన కంటెంట్ యూత్‌లో విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టింది. కానీ, 2023లో పాకిస్తాన్‌కి వెళ్లిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్ ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం బలమైన సంబంధంగా మారి, జ్యోతి అతడి వలలో చిక్కింది.
డానిష్ మాయలో పడి జ్యోతి గూఢచర్యానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాట్సప్, ఇతర ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ అప్లికేషన్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప ప్రాంతాల సమాచారం, ఆయుధ నిల్వల వివరాలను పంపినట్లు నిర్ధారణ అయ్యింది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను స్పైయింగ్ కోసం ఆమె ఉపయోగించిన తీరు భద్రతా సంస్థలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన ఒక ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్న వీడియోలతో పాటు, పాక్ జాతీయ దినోత్సవంపై ఆమె చేసిన సంభాషణలు బయటపడ్డాయి. జ్యోతి పహల్గామ్ ప్రాంతాన్ని గతంలో సందర్శించిన విషయం దర్యాప్తులో కీలకంగా మారింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఆమెకి సంబంధం ఉందా? అన్న అనుమానంతో పోలీసులు ఆ కోణంలో దృష్టి సారించారు.
జ్యోతి తన యూట్యూబ్ వీడియోల ద్వారా సైనిక స్థావరాలకు సమీప ప్రాంతాలను చిత్రీకరించి, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలను కోడ్ భాషలో ఐఎస్ఐకి పంపినట్లు విచారణలో వెల్లడైంది. హర్యానా–పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో 2024 చివరలో భారత సైనిక కదలికలపై కూడా ఆమె సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమెపై అనుమానం వ్యక్తం చేసి నిఘా పెంచాయి. ఆమె ఫోన్, మెసేజ్‌లను పసిగట్టి, వీడియోలలో కనిపించిన దృశ్యాలు ఉద్దేశపూర్వక మైనవని నిర్ధారించాయి.
ప్రస్తుతం జ్యోతిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ల్లో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల ఫోటోలు దొరికాయి. ఈ కేసులో మరో ఆరుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆధారాలతో జ్యోతిపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఓ యూట్యూబర్ ఈ విధంగా గూఢచర్యానికి పాల్పడటం దేశ భద్రతకు తీవ్ర హెచ్చరికగా మారింది.