- విజయవాడ నుంచి కొత్త హైవే…
- దారి మళ్లింపుతో …వాహనదారుల్లో ఉత్సాహం
సంక్రాంతికి ఎక్కడెక్కడివాళ్లు అందరూ సొంతూళ్లకు ఆనందంగా బయలుదేరారు. అయితే హైదరాబాద్ లేదా తిరుపతి తదితర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం , విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలకు వెళ్లాలంటే, కచ్చితంగా విజయవాడను దాటి వెళ్లాల్సిందే. అంతేకాదు, ఆ క్రష్ణమ్మ వంతెన ఎక్కాల్సిందే.
అలా కనకదుర్గమ్మ వారధి పట్టుకుని, అక్కడ నుంచి ఏలూరు రోడ్ ఎక్కి, అటు నుంచి బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్ రోడ్డు మీదుగా ముందుకెళితేనే గానీ, నగరంలోని ట్రాఫిక్ వదలదు. ఈ సంక్రాంతి సీజన్ లో అటు విజయవాడ ప్రజలు షాపింగుల కోసం బయటకు వస్తారు. చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చేవాళ్లు వస్తారు. నిరంతరం ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. ట్రాఫిక్ ఒకేసారి పెరిగిపోయి విజయవాడ నగరంలోనే మూడు నుంచి నాలుగు గంటలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో పోలీసు అధికారులు ఒక ఆలోచన చేశారు. అదేమిటంటే,
విజయవాడ సమీపంలో నిర్మిస్తున్న… పశ్చిమ బైపాస్
మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
ఇది నూతన రహదారి. ఇంకా ప్రారంభం కావల్సింది. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి వరకు 30 కి.మీ. మేర కొత్తగా ఆరు వరుసల బైపాస్ నిర్మిస్తున్నారు. దీనిని 2020లో కేంద్ర మంత్రి గడ్కరి శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం సంక్రాంతి దెబ్బకి విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ ద్రష్ట్యా పోలీసు అధికారులు ఈ నూతన రహదారిపైకి ట్రాఫిక్ మళ్లించారు. అయితే అక్కడక్కడ విద్యుత్తు హైటెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయి. కాకపోతే వాహనాలకు తగిలే పరిస్థితి లేకపోవడంతో సంక్రాంతి వారం, పదిరోజులకు ఇబ్బంది లేదని గ్రహించి, వాహనాలను కొత్త హైవే మీదకు వదిలేశారు.
దీంతో కొత్త రహదారి మీద సంక్రాంతి బుల్లోళ్లు విజిల్ వేసుకుంటూ వాహనాలపై రయ్ మని వెళ్లిపోతున్నారు. గత రెండురోజుల నుంచే వాహనాలకు అనుమతిచ్చారు. దీంతో గొల్లపూడి- చిన్నఅవుటపల్లి బైపాస్ ను గంటలో దాటేయవచ్చు. అలా ఏలూరు హైవే ఎక్కేయవచ్చు. అయితే అతి త్వరలోనే ఈ మార్గం ప్రారంభోత్సవం కానుందని అధికారులు చెబుతున్నారు.