26.7 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ లో జోరుగా పైరవీలు

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీల స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికల జరగనుండగా మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతోన్న హసన్ మీర్జా, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీ కాలం మార్చి 29న ముగుస్తుండగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న ఎమ్మె్ల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
మార్చి 3వ తేదీన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 11న నామినేషన్ల పరిశీలన జరిపి, ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు ఇస్తారు. మార్చి 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజు కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మెుత్తం 5 స్థానాలకు గాను సంఖ్యా పరంగా కాంగ్రెస్ నాలుగు స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కించుకునే ఛాన్సుంది. కాంగ్రెస్‌ నుంచి ఆశావాహులు అధికంగా ఉన్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి తనకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించాలని బలంగా డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీ నుంచి ఒక్కడినే ఎమ్మెల్సీగా ఉన్నా మంత్రివర్గంలో చాన్స్‌ ఇవ్వలేదని.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో పెద్దలసభకు పంపాల్సిందేనని ఒత్తిడి తీసుకొస్తున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కెసిఆర్‌ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడలేదు. ఆ రోజు పార్టీ మారి ఉంటే కెసిఆర్‌ హయంలో సీనియర్‌ మంత్రిగా ప్రాధాన్యత ఉండేదని, కాంగ్రెస్‌ ను నమ్ముకుంటే లాబీయిస్టులకే పనులు జరుగుతున్నాయని జీవన్‌ రెడ్డి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పోటీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇస్తే పార్టీలో అసంతృప్తి రగిలే ప్రమాదం ఉంది. అయితే ముఖ్యమంత్రి అనుంగు స్నేహితుడుగా ఉన్న నరేందర్‌ రెడ్డికి ఈ దఫా పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని…హోం, విద్యా, పురపాలక శాఖల్లో ఒకటికి ఆయనకు ఇస్తారని కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేగా తనకు తుంగతుర్తి టికెట్‌ దక్కలేదని…అయినా పార్టీని నమ్ముకుని ఉన్నానని అద్దంకి దయాకర్‌…ఎమ్మెల్సీ పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నాడు. నల్గొండ రెడ్డి నేతల్లో అనేక వర్గాలు ఉన్నా..అద్దంకి విషయంలో ఏ ఒక్కరు మనస్పూర్తిగా మద్దతు ఇవ్వటం లేదని సమాచారం. పైగా కాంగ్రెస్‌ లో మాలలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనే ప్రచారం జరుగుతోందని, మాదిగలు దూరం అయితే పార్టీకి నష్టమని చర్చిస్తున్నట్టు తెలిసింది. అద్దంకి దయాకర్‌ కు ఎమ్మెల్సీ రావటం అంటూ జరిగితే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటే గాని దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు అంటున్నారు.

మరోవైపు మైనారిటీ కోటాలో తనను పెద్దల సభకు పంపాలని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తన వాదన వినిపిస్తున్నారు. శాసనమండలికి పంపితే మైనారిటీల కోటాలో మంత్రివర్గంలో స్థానం సంపాదించవచ్చని షబ్బీర్‌ అలీ పావులు కదుపుతున్నారట. ఢిల్లీలో గులాం నబీ ఆజాద్‌ చక్రం తిప్పినంత కాలం రాష్ట్రంలో షబ్బీర్‌ అలీ మాట చెల్లుబాటు అయింది. ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి కరుణాకటాక్షాలు తప్పితే షబ్బీర్‌ అలీకి వేరే మార్గం లేకుండా పోయింది.
పార్టీకి నమ్మినబంటులా పనిచేస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ కోరుతున్నారు. ఎస్‌సి వర్గీకరణకు మద్దతు తెలిపిన బిజెపి… మాదిగలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉందని…ఈ తరుణంలో మాదిగ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని లేదంటే తప్పుడు సంకేతాలు వెళతాయని సంపత్‌ అంటున్నారు. మహారాష్ట్రలో పార్టీ తరపున సేవలు అందించిన సంపత్‌ కుమార్‌ కు అధిష్టానంలో సానుభూతి ఉంది. అది ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరో సీనియర్ నేత జి చిన్నారెడ్డి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి టికెట్ కేటాయించినట్టే చేసి చివరి నిమిషంలో మేఘారెడ్డిని బరిలో నిలిపారు. ఈ నేపథ్యంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చిన్నారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు మహిళల కోటాలో తనకు అవకాశం కల్పించాలని మాజీఎమ్మెల్సీ ఆకుల లలిత కోరుతుండగా…కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సునితా రావు వీలు చిక్కినప్పుడల్లా పార్టీ పెద్దలకు విన్నవిస్తున్నారు. అయితే ముదిరాజ్‌ కోటాలో సునితా రావుకు ఇస్తే మహిళలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, ముదిరాజ్‌ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచినట్టవుతుందని అధిష్టానం యోచిస్తోంది.
వీరందరితోపాటు మాజీఎంపి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ నానా హంగామా చేస్తున్నారు. కాంగ్రెస్‌ లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం పెరిగిందని బీసీలను విస్మరిస్తున్నారని మండిపడుతున్నారు. సీనియర్‌ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వీరందరి పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచన మరోవిధంగా ఉన్నట్టు నేతలు చెప్పుకుంటున్నారు. నాలుగు ఎమ్మెల్సీల్లో ఖచ్చితంగా సామాజిక సమతౌల్యం పాటించాల్సిందేనని సీఎం పట్టుదలగా ఉన్నారని చెపుతున్నారు.
అయిదు ఎమ్మెల్సీల్లో ఒకటి బీఆర్‌ఎస్‌కు ఖచ్చితంగా దక్కుతుంది. ఆ సీటును ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ కు కేటాయించాలని అధినేత కెసిఆర్‌ అభయం ఇచ్చారని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com