తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖాయమయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల హడావిడి.. ప్రచార వేడి గమనిస్తే అలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈనెలాఖరులో పలు కీలక పథకాలను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఆ సందడి అలా ఉండగానే.. జనాన్ని ముఖ్యంగా ఓటర్లను స్థానిక సంస్థల ఎన్నికలవైపు దృష్టి మరల్చేలా చేయాలన్నది వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఫిబ్రవరి చివరినాటికి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే ఏప్రిల్ నెలలో కచ్చితంగా స్థానిక పోలింగ్ నిర్వహించాల్సిందే అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు రాష్ట్రంలో ఆలస్యం అవుతున్న కొద్దీ ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. మరోవైపు.. త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ క్షేత్రస్థాయిలో స్థానిక నాయకుల నుంచి ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. గతవారం గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి యేడాది పూర్తయిందని చెబుతూ.. పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకత్వాలను కూడా ముఖ్యనేతలు పట్టించుకోవాలంటూ కేసీ చురకలంటించారు. ఈ పరిణామంతో ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ఉనంచి సమాచారం వస్తోంది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు చిక్కుముడిగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కులాల వారీగా జనాభా ఎంత ఉంది? ఆయా కులాలకు చెందిన నాయకుల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితి ఎలా ఉంది? అనే అంశాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్‌లో కులగణన సర్వే నిర్వహించింది. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత కులగణన సర్వే రిపోర్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. కేబినెట్ సమావేశంలో ఆ సర్వే నివేదికను ఆమోదించి, ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసి ఈ అంశంపై చర్చ నిర్వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం 27 శాతం రిజర్వేషన్ ఆ వర్గాలకు అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ హామీ మేరకు బీసీలకు 42 శాతం అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించొద్దు. ఈ నేపథ్యంలో కులగణన సర్వే నివేదికను పరిగణనలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం కోరుతుందని చెబుతున్నారు. పార్లమెంటులో ఈ మేరకు చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోతే.. స్థానిక ఎన్నికల్లో రేవంత్ సర్కారు ఏ వైఖరి అవలంబిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. పాత పద్ధతిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇస్తుందా? లేక ఇతర మార్గాలను అన్వేషిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ పథకాల వేడిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్దామని, అలా వెళ్తే కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందని స్థానిక నాయకులు కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 15 రోజుల్లో నిర్వహణ పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తే.. అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల కోడ్ లోపు పథకాల అమలు పూర్తవుతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్పటికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు పూర్తిస్థాయిలో నిధులు సమకూరడం సాధ్యమవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల నాటికి లబ్దిదారులందరికీ ఆర్థిక సాయం అందితేనే ఫిబ్రవరి చివర్లో ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే.. ఏప్రిల్ నాటికి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు.