33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

లేటెస్ట్ ట్రెండ్… గ్రే డైవర్స్

  • హాట్ టాపిక్ గా మారిన గ్రే డైవర్స్ కాన్సెప్ట్
  • పాతికేళ్ళు కాపురం తరువాత విడిపోతున్న జంటలు
  • లేటు వయసులో వివాహ బంధానికి బ్రేకులు
  • అమెరికాలో 65 ఏళ్ళు పైబడినవారు కూడా విడాకులు

మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహ్మాన్ విడాకుల ఎపిసోడ్ నేపథ్యంలో గ్రే డైవర్స్ అన్న కాన్సప్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డైవర్స్ గురించి తెలుసుగాని…ఈ గ్రే డైవర్స్ అంటే ఏంటి అని ఆరా తీస్తున్న వాళ్లూ ఉన్నారు. ప్రీ మ్యారేజ్ షూట్, హల్దీ, సంగీత్ అంటూ హంగామా చేసి, అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కూడా కాళ్ల పారాణి ఆరక ముందే విడాకుల బాట పడుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లేక, టైమ్ రాక, ఆవేశంతో డైవోర్స్ కు అప్లై చేస్తున్నారు అన్నది వీరి విషయంలో వినిపించే విశ్లేషణ. దీనికి రివర్స్ కాన్సప్టే గ్రే డైవర్స్. ఇరవై ఏళ్లో, పాతికేళ్లో కలిసి ఒకే గూడు కింద జీవించి, కష్ట సుఖాల్ని పంచుకుని, పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత భార్యాభర్తలు విడిపోవటమే గ్రే డైవోర్స్. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్, భార్య సైరా భాను విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఈ జంట తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించటంతో అందరూ షాక్ కు గురయ్యారు. వీరే కాదు ఇలా లేట్ వయస్సులో వివాహ బంధానికి బ్రేక్ వేసిన జంటలు చాలానే ఉన్నాయి. అమిర్ ఖాన్-కిరణ్ రావు, హృతిక్ రోషన్-సుశాన్, సైఫ్ అలీఖాన్-అమృతా సింగ్, కమల్ హాసన్-సారిక, మలైకా అరోరా- అర్బాజ్ ఖాన్ ఇలా ఈ క్యాటగిరీలోని జంటలే. మాజీ విశ్వసుందరి, ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ జంట కూడా విడిపోతున్నట్లు గత కొంత కాలం నుంచే ప్రచారం జరుగుతోంది. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్, ఆయన భార్య మిలిండా కూడా 27 ఏళ్ల కాపురానికి 2021లో ఫుల్ స్టాప్ పెట్టి వేరు పడిన సంగతి తెలిసిందే. ఇలా చూస్తే జుట్టు తెల్లబడిన వయస్సులో కొత్త జీవితానికి దారులు వెతుక్కోవటానికి విడాకులు ఇస్తున్న జంటల లిస్ట్ ఎక్కువగానే ఉంటుంది. పిల్లలకు చెప్పాల్సిన వయస్సులో ఇవేం పనులు అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నా…వాటిని పట్టించుకునే స్థితిని దాటి ముందుకు వెళ్లిపోతున్నాయి ముదుసలి జంటలు. ఆరు పదులు దాటిన వయస్సులో మిగిలిన జీవితం అయినా నచ్చినట్లు బతకకపోతే ఎలా అన్నది వీరి ఫీలింగ్. తప్పులేదు ఎవరి ఆలోచన వారిది, ఎవరి స్వేచ్ఛ వారిది. అయితే ఇక్కడే కీలకమైన పాయింట్ ఉంది. ఇన్నేళ్లు కలిసి బతికినా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారా…ఇష్టం లేని బంధంలో జీవితం అంతా నెట్టేశారా…పాతిక, ముప్ఫై ఏళ్లు సర్దుకుని బతికి…తోడు అవసరం అయ్యే అసలైన వయస్సులో ఇక చాలు ఈ బంధం అని బయటపడటానికి కారణాలు ఏంటి.

ప్యూ రీసెర్చ్ వంటి సంస్థలు గ్రే డైవర్స్ అనే కాన్సెప్ట్, ట్రెండ్స్ పై పలు అధ్యయనాలు చేశాయి. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా గ్రే డైవర్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 2021లో అమెరికా సెన్సెస్ బ్యూరో చేసిన అధ్యయనం 65 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నట్లు గమనించింది. 2022లో జరిగిన మరో అధ్యయనంలో కూడా లేట్ వయస్సులో విడాకుల సంఖ్య పెరుగుతోందని తేల్చింది. 1990 ప్రాంతాల్లో 50 ఏళ్ళు దాటిన వారిలో విడాకుల రేటు 8.7 శాతం ఉంటే…2019 నాటికి ఈ సంఖ్య 36 శాతానికి పెరిగిందట. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతుంది. అయితే ఏ పరిస్థితులు 50, 60 ఏళ్ళు దాటిన వారు 2, 3 దశాబ్దాలు సాగిన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి దారి తీస్తున్నాయో చూద్దాం. ప్రధానంగా ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్ (empty nest syndrome). 60 ఏళ్ల వయస్సులో ఉండే జంటల పిల్లలు పెద్ద వాళ్ల అయి వారి కెరీర్స్ లో, జీవితాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు. ఖాళీ అయిన గూడులో మిగిలిన భార్యాభర్తలు ఒకరి నొకరు పూరించుకోక తప్పని పరిస్థితి. వయస్సులో ఉన్నప్పుడు కెరీర్ కోసం పరుగులు, పిల్లల పెంపకం బాధ్యతల్లో తమను తాము కోల్పోయిన వాళ్లు … ఇప్పుడు వారి గురించి ఆలోచించుకోవటం మొదలవుతుంది. భాగస్వామి మీద ఇన్నేళ్లు అదిమి పెట్టుకున్న అసంతృప్తిని వ్యక్తం చేయటానికి ఈ వయస్సులో వారికి అవకాశం చిక్కుతోంది. అందుకే ఇక చాలు అని విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

విడాకులు తీసుకుంటే పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళ సమయంలో సమాజం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి అని ఆలోచన కూడా ఈ బాధ్యతలు తీరిన తర్వాత విడాకుల దారి పట్టడానికి ఒక కారణం. వివాహేత సంబంధాలు మరో కారణంగా కనిపిస్తోంది. ఆర్ధిక పరిస్థితులు కూడా ఈ ట్రెండ్ కు మరో కారణం. పోస్ట్ రిటైర్ మెంట్ ఫైనాన్షియల్ ప్లాన్స్ చక్కగా చేసుకున్న వారికి ఆర్ధిక భరోసా ఉంటుంది. దీనితో బంధాల నుంచి బయటపడుతున్నారు. దీర్ఘ కాలిక వ్యాధులు కూడా ఒక గ్రే డైవోర్స్ కు ఒక కారణం అని అధ్యయనాల్లో తేలింది. అయితే భర్త దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతుంటే విడాకులు తీసుకునే భార్యల కంటే …భార్యకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వదిలించుకోవాలి అనుకుంటున్న లేటు వయస్సు భర్తల సంఖ్యే ఎక్కువగా ఉంటోందట. ఇక విడాకులు అనే అంశాన్ని మన సమాజం చూస్తున్న తీరు కూడా మారింది. గతంలో లాంటి స్టిగ్మా ఇప్పుడు లేదు. విడాకుల ప్రక్రియ, న్యాయ సలహా, సేవ తేలిగ్గా దొరుకుతోంది. అంతే కాదు మెడికల్ సర్వీసెస్ అందుబాటు కూడా పెరిగింది. దీని వల్ల అనారోగ్యానికి గురైతే ఈ వయస్సులో చూసే వాళ్లు ఎవరూ అన్న అభద్రతా భావం తగ్గుతోంది. ఇంటికే వచ్చి చేసే వైద్య పరీక్షలు, మెడిసెన్ డోర్ డెలివరీ, వృద్ధులకు సేవలు అందించే ఏజెన్సీలు పెరగటం…ఇవన్నీ మారుతున్న జీవనశైలికి అద్దం పడుతున్నాయి.

ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా చాలా మంది పరిచయం కావటంతో వ్యక్తిగత స్నేహ సంబంధాలను పెంచుకునే వెసులుబాటు పెరుగుతోంది. భావోద్వేగాలను పంచుకునే వేదికలు దొరుకుతున్నాయి. విడాకులు తీసుకున్నా ఒంటరితనం దరిదాపుల్లోకి రాకుండా టెక్నాలజీ ఉపయోగపడుతోంది. వివాహ బంధంలో ఇరవై, పాతికేళ్లో గడిపినా తమకు భాగస్వామి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు అనుకున్న వారు…ఇకనైనా తమకు నచ్చినట్లు, రాజీపడకుండా బతకాలి అన్న ఫీలింగ్ తో విడాకులు తీసుకుంటున్నారు. మారుతున్న సామాజిక, ఆర్ధిక, కుటుంబ పరిస్థితులు లేటు వయస్సులో విడాకులకు దారి తీస్తున్నాయి. విడాకులు తీసుకోవటానికి ఎవరి కారణాలు ఎలా ఉన్నా… ఒకటి మాత్రం వాస్తవం. తెగిన బంధం ఎప్పటికీ మానని గాయంలా వెంటాడుతూనే ఉంటుంది. నొప్పి సలుపుతూనే ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com