లేడీ బాస్ విజయ శాంతి లేటెస్ట్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత.. విజయ శాంతి తొలిసారి పొలిటికల్ కామెంట్స్ చేశారు. సహజంగానే బీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేసీఆర్పై అస్త్రాలు ఎక్కు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను గత బీఆర్ఎస్ ఖాళీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ శాంతి. కేసీఆర్ పాలనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని విజయ శాంతి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికే ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందని, దీనికి బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని పదేళ్లలోనే పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయేలా చేశారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇదే విషయాన్ని తాను గతంలో ఎన్నో సార్లు ప్రస్తావించానని విజయ శాంతి గుర్తు చేశారు.