25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

కుంభమేళా… తెలుగు రాష్ట్రాల నుంచి రవాణా సౌకర్యాలు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13న పుష్య పౌర్ణమి రోజు ప్రారంభమై ఫిబ్రవరి 26 మహా శివరాత్రి వరకు మహా కుంభమేళా జరుగుతుంది. పుష్కరానికి (12 ఏళ్లకు) ఒకసారి జరిగే  కుంభమేళకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారు.

కుంభమేళ సమయంలో త్రీవేణి సంగమంలో స్నానాలు ఆచరించి పూజలు చేస్తే పుణ్యగతులు సిద్దిస్తాయని పురాణాలు చెపుతున్నాయి. దక్షిణాదిలో వివిధ రాష్ట్రాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి తెలుగువారు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

గంగా, యమునా, సరస్వతీ సంగమ ప్రాంతమైన ప్రయాగ్‌రాజ్‌కు ఎలా చేరుకోవాలి..? తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి ఒకటే రైలు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఇది సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ నడుస్తోంది. అక్కడికి చేరుకునేందుకు 25 గంటల సమయం పడుతుంది. ప్రయాగ్‌రాజ్ తోపాటు దానికి సమీపంలోని రాంబాగ్ స్టేషన్లలో ఆగుతుంది.

జనవరి 8 నుంచి ప్రత్యేక రైళ్లు

కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా…దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.

ఇప్పటివరకు 16 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 8 నుంచి సికింద్రాబాద్, మౌలాలి, తిరుపతి, మచిలీపట్నం, నరసాపూర్ నుంచి రైళ్లు నడపనున్నారు. వీటితోపాటు డిమాండ్ కు అనుగుణంగా కుంభమేళా రోజుల్లో మరో 40 రైళ్లు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

26 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా ప్రయాణించనున్నాయి. ఇవి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

రైల్వే ప్యాకేజీలు 

ఐఆర్‌సీటీసీ రైళ్లలో వారం రోజుల ప్యాకేజీ ఉంది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు వారణాసి, అయోధ్య యాత్ర కూడా ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఉండేందుకు టెంట్ సౌకర్యం కూడా ఈ ప్యాకేజీలో లభిస్తుంది. రోజువారి రైళ్లతో పోల్చితే ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తారు.

విజయవాడ నుంచి ఆది, మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉండగా… విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సన్నాహాలు చేసింది. వీటికి సంబంధించి రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి.

కుంభమేళా రద్దీ తట్టుకునేందుకు రైల్వే శాఖ ప్రయాగ్‌రాజ్ జంక్షన్, రాంబాగ్, సుబేదార్ గంజ్, నైనీ, చివకి, సంగమం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసింది. వీటిలో ప్రయాగ్ రాజ్ జంక్షన్, సంగమం స్టేషన్లలో దిగితే కుంభమేళాకు తొందరగా చేరుకోవచ్చు. ఈ స్టేషన్ల నుంచి బ్యాటరీ రిక్షాలు, ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో  చేరుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది.

ప్రయాగ్ రాజ్ కు విమాన సర్వీసులు

హైదరాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్‌కు విమానాలు ఉన్నాయి. ప్రతి రోజు ఉదయం 10.50 గంటలకు ఇండిగో విమానం వెళుతుంది. మరొకటి కనెక్టింట్ ఫ్లైట్ అందుబాటులో ఉంది.

విజయవాడ, విశాఖపట్నం నుంచి నేరుగా ప్రయాగ్ రాజ్ కు సర్వీసులు లేకపోయినా వయా(కనెక్టింగ్) విమానాల సౌకర్యం ఉంది. కుంభమేళా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మరిన్ని విమానాలు నడిపేందుకు అవకాశాలు ఉన్నాయి.

విమానాశ్రయం(బమ్‌రౌలి) నుంచి ప్రయాగ్‌రాజ్ నగరానికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కుంభమేళా ప్రాంతానికి మరో ఐదు కిలోమీటర్ల దూరం అధికంగా ఉంటుంది.

హైదరాబాద్ నుంచి ప్రయాణానికి గంటా 40 నిమిషాల సమయం పడుతుండగా ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ప్రీపెయిడ్ ట్యాక్సీలు, బ్యాటరీ రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

ట్యాక్సీల రేట్లు అధికంగా ఉన్నా… ప్రయాగ్‌రాజ్ నగరానికి చేరుకోవడానికి 700 రూపాయలు, కుంభమేళా ప్రాంతానికి చేరుకునేందుకు వెయ్యి వరకు ఛార్జీ చేస్తున్నారు.

అయితే బ్యాటరీ రిక్షాల్లో విమానాశ్రయం నుంచి ప్రయాగ్‌రాజ్ కు 200, కుంభమేళా ప్రాంతానికి 400 రూపాయల వరకు తీసుకుంటారు. విమానాశ్రయం నుంచి బయటకు నడుచుకుంటూ వస్తే, పార్కింగ్ చార్జీలు ఉండవు కనుక మరింత తక్కువ ధరలో వస్తారు.

కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ కు విమాన టికెట్ల రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో వారణాసికి చేరుకుని అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్ చేరుకోవచ్చు.

ప్రయాగ్ రాజ్ కు రోడ్డు మార్గం

టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులు లేవు. గ్రూపుగా వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. అన్ని పట్టణాల వారు సంబంధిత డిపో మేనేజరును సంప్రదిస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.

ప్రయాగ్‌రాజ్‌కు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి బస్సులు నడుపుతున్నాయి.  బస్సుల్లో 23 నుంచి 31 గంటల వరకు ప్రయాణం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, నాగ్ పూర్, జబల్ పూర్, మిర్జాపూర్ మీదుగా ప్రయాగ్ రాజ్ చేరుకోవచ్చు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ప్రయాగ్‌రాజ్ రావాలంటే నాగ్‌పుర్, జబల్‌పుర్ మీదుగా ప్రయాగ్ రాజ్ చేరుకోవచ్చు.

కుంభమేళాకు భక్తులు అధికంగా వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. 2013లో కుంభమేళాకు 20 కోట్ల మంది హాజరయ్యారని… ఈసారి రెండింతలు అవుతుందని, ఇందుకు తగ్గట్టుగానే 1.60 లక్షల టెంట్లు సిద్ధం చేసింది.

ఈ టెంట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ పర్యటక శాఖ అవకాశం కల్పించింది.

https://kumbh.gov.in/ లేదా upstdc.co.in వెబ్‌సైట్లలో వీటిని బుక్ చేసుకోవచ్చు.

8887847135 ఫోన్ నెంబరుకు Hi అని వాట్సాప్ సందేశం పంపితే, చాట్ బాట్ అందుబాటులోకి వస్తుంది. దాని సూచనలను అనుసరించి వసతి బుకింగ్ సమాచారం తెలుసుకునే వీలు కల్పించారు.

ప్రయాగ్ రాజ్ లో ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండగా… కుంభమేళా ప్రారంభం అయ్యే నాటికి మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కుంభమేళాకు వెళ్లి వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com