హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కొలిక్కి వస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1గా చేర్చారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీమంత్రి కెటిఆర్ లను ప్రధానంగా పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ఏ1గా, ఏ2గా అరవింద్ కుమార్ పేర్లు నమోదయ్యాయి. అలాగే ఏ3గా హెచ్‌ఎండీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిప్రైవేట్ కంపెనీ సీఈవో బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ. 55 కోట్ల నిధులను విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్ రేస్ లో అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పేరు వినిపించడంతో గవర్నర్ కు ప్రభుత్వం ఫైల్ పంపించింది. గవర్నర్ నుండి తాజాగా గ్రీన్ సిగ్నల్ రాగా ఏసీబీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి కేటీఆర్ పై 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. అలాగే ఈ కేసులను ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద నమోదు చేయగా.. 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులుగా ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
కేసు నమోదుపై స్పందించిన మాజీమంత్రి కెటిఆర్ శాసనసభ వేదికగా స్పందించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఫార్ములా ఈ కార్ రేస్ ఆంశాన్ని శాసనసభలో చర్చకు పెడితే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు.