పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే నెల 7వ తేదీన భారత వైమానిక దళాలు పాక్ అక్రమిత్ కాశ్మీర్, పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రస్ధావరాలపై దాడులు చేసి వారి శిబిరాలను మట్టుపెట్టిన వ్యవహారంలో పలు ఉగ్రవాద సంస్ధలకు చెందిన కీలక నేతలు హతమయ్యారు. అయితే ఈ దాడుల్లో ఏ ఉగ్రవాద సంస్ధకు చెందిన ఏ ఉగ్రనేత చనిపోయింది రక్షణ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ప్రధానంగా జైష్ ఏ మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్ధలకు చెందిన అత్యంత కీలక నేతలు ఈ దాడుల్లో హతమారినట్లు భారత రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
భారత్ వైమానిక దాడుల్లో మృతి చెందిన వారిలో లష్కరే తోయిబా చెందిన ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబు ఉన్నాడు. మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబా స్ధావరం మర్కజ్ తైబాకు ఇతను ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. భారత వైమానిక దళం తొట్టతొలి దాడి ఈ శిబిరం మీదే జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యం ముదస్సర్ అంత్యక్రియలకు గార్డ్ ఆఫ్ హానర్ ను స్వీకరించింది. పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ సీయంలు ముదస్సర్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. గ్లోబర్ టెర్రరిస్ట్ గా ప్రకటించబడిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నేతృత్వంలోని పాఠశాలలో ముదస్సర్ అంత్యక్రియలు నిర్వహించారు. పాక్ ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ తో పాటు పంజాబ్ పోలీస్ ఐజీ ప్రార్ధన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది పాకిస్తాన్ సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలను తేటతెల్లం చేస్తుంది.
ఇక ఇదే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా కూడా భారత వైమానిక దాడుల్లో మృతి చెందాడు. ఇతను జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాలో కూడా ఇతనికి సంబంధం ఉంది. ఫైసలాబాద్ లో జరిగిన ఖలీద్ అంత్య క్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారులతో పాటు ఫైసలాబాద్ డిప్యూటీ కమీషనర్ కూడా హాజరయ్యారు.
ఈ దాడుల్లో బాగా దెబ్బతింది జైషే మహ్మమ్మద్ ఉగ్రవాద సంస్ధ. జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 15 మంది సభ్యులు ఈ దాడుల్లో చనిపోయారి. ఉగ్రవాద కార్యకలాపాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉండే ముగ్గురు కీలక నేతలు హతమయ్యారు. వారిలో ఒకరు హఫీజ్ మహమ్మద్ జమీల్ కాగా, మహమ్మద్ యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్‌జీ రెండో ఉగ్రవాది కాగా, మహమ్మద్ హసన్ ఖాన్ మూడొవ ఉగ్రవాద నేత. హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసుఫ్ అజార్ లు జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ బావమరుదులు. వీరిలో జమీల్ బహవల్పూర్ లోని మర్కజ్ సుభాన్ అల్లా స్ధావరం ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నాడు. యువతకు తీవ్రవాద బోధనలతో పాటు జైషే కోసం నిధుల సేకరణలో జమీల్ చురుగ్గా పాల్గొంటాడు. ఇక మరో బావమరిది యూసుఫ్ జేషే కోసం యువకులకు ఆయుధాల శిక్షణ ఇస్తుంటాడు. కాంధహర్ విమానం హైజాకింగ్ కేసులో ఇతను వాంటెడ్ నిందితుడు. చివరగా మొహమ్మద్ హసన్ ఖాన్ పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ లో జైషే మహమ్మద్ ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్‌ఖాన్ కాశ్మీరా కుమారుడు. జమ్మూ, కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో హసన్ ఖాన్ ది కీలక పాత్ర.