- పార్లమెంటు వేదికగా బీజేపి చివరి ప్రచారాస్త్రం
- కేంద్ర పథకాలు ఢిల్లీ ప్రజలకు అందడం లేదని ఆవేదన
- ముగిసిన ఎన్నికల ప్రచారం
- మూత పడిన మైకులు, ప్రచార రథాలు
- పార్టీల వైఖరులతో ముక్కోణపు పోటీ
- చివరి రోజు 22 రోడ్డు షోలతో బీజేపి హల్ చల్
- ఎల్లుండి ఎన్నికలు.. 8న ఫలితాలు
ఢిల్లీ లో పేద ప్రజల సొంతింటి కలను ఆప్ అధినేత కేజ్రీవాల్ భగ్నం చేశారని విమర్శించారు.దేశమంతటా అందుకున్న ఈ పథకాన్ని కేజ్రీవాల్ కారణంగా ఢిల్లీ ప్రజలు అందుకోలేకపోయారని అన్నారు.కేజ్రీవాల్ అద్దాల మేడల్లో ఉంటూ పేద ప్రజలను మాత్రం మురికి వాడలకు పరిమితం చేశారన్నారు.ప్రజా రవాణా వ్యవస్థ నుంచి ఆయుష్మాన్ భారత్ వరకూ,విశ్వ కర్మ యోజన పథకం నుంచి అనేక ఇతర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేసిన ఘనుడు కేజ్రీవాల్ అని బిధూరీ తీవ్రంగా దాడి చేశారు.ఎన్నికల ప్రచారం చివరి రోజున పార్లమెంటు సాక్షిగా బీజేపి ఆప్ ను ఏకిపారేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రారంభమైన చర్చలో బిధూరీ ఆప్ పై చివరి ప్రచారాస్త్రాన్ని సంధించారు.
ముగిసిన ప్రచారం
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది.పార్టీల తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలమధ్య అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగింది.ఓటర్లను ఆకట్టుకోడానికి పార్టీలన్నీ చివరి వరకూ ప్రయత్నాలు చేశాయి. నెల్లాళ్ల విస్తృత ప్రచారానికి కాసేపటి క్రితం తెర పడింది. ఆప్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ప్రచారానికి చివరి రోజైన ఇవాళ బీజేపి 22 రోడ్డు షోలు,ర్యాలీలు నిర్వహించింది.దేశరాజధానిపై పట్టుకోసం గత పాతికేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపి ఈసారి తన ప్రచార సరళిని మార్చింది.
ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా బీజేపి తరపున ఢిల్లీలోప్రచారం నిర్వహించాయి. ఏపీ సీఎం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఇవాళ తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఆప్ పరిపాలన అన్ని రంగాల్లోనూ విఫలమైందని వారనుసరిస్తున్న గవర్నెన్స్ మోడల్ సరైనది కాదని అన్నారు. పాలనలో సరైన మోడల్ అంటే మోడీ టీమ్ నే చెప్పాలని అందుకే ఢిల్లీకి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని అన్నారు. ఉచితాలతో కూడిన పాలన ప్రగతి నిరోధకమని, ఏపీలో జగన్ పాలన కూడా అలాగే ఉండేదని ఘోరంగా విఫలమైన ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు ఇపుడు తాను నడుం బిగించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఉచితాలే ఊపిరిగా ఆప్
ఢిల్లీలో ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు ఉబలాటపడుతున్న ఆప్ మాత్రం ప్రజలకు సంక్షేమ పథకాలను, ఉచితాలను అందిస్తూనే పాలన సాగిస్తూ రెండుసార్లు గెలిచింది. కేజ్రీవాల్ ఈసారి కూడా అదే అస్ల్రంగా బరిలోకి దిగారు. ఢిల్లీ ప్రజలకు జనరంజకమైన స్కీములు ప్రకటించారు. కేజ్రీవాల్ మేనిఫెస్టోని చూశాక బీజేపి కూడా తన రూటు మార్చి పెద్ద ఎత్తున ఉచితాలను ప్రకటించింది.ఢిల్లీలో యమునా నీరు కూడా ఈసారి ప్రచారాస్త్రంగా మారిపోయింది.
నామమాత్రంగా కాంగ్రెస్ పోటీ
దేశరాజధానిని పదిహేనేళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించిన కాంగ్రెస్ ఆతర్వాత చతికిల బడింది. 2013 తర్వాత కాంగ్రెస్ అక్కడ తుడిచి పెట్టుకు పోతూ వస్తోంది. ఈసారి ఇండియా బ్లాక్ మిత్రపక్షమైన ఆప్ తో కలసి పోటీకి దిగాల్సి ఉన్నా కూటమిలో విభేదాల కారణంగా ఎవరికి వారే అన్నట్లుగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ బీజేపికి బదులు ఆప్ పైనే విమర్శనాస్త్రాలు ఎక్కువగా ఎక్కు పెట్టింది.దాంతో ఢిల్లీ ఎన్నికలు ముక్కోణపు ఎన్నికలుగా మారాయి.
ఉథృతమైన ప్రచార శైలి.
ఈసారి ఎన్నికల కోసం పార్టీలన్నీ ప్రచారంలో ఓ అడుగు ముందుకేసాయి. డిజిటల్ కాంపెయినింగ్ కొత్త పుంతలు తొక్కింది. మీమ్స్, జోకులు, హాస్యకరమైన టిట్ బిట్లు ఇలా రకరకాల పోకడలతో ప్రచారం జరిగింది.
ప్రచారంలో కొత్త పుంతలు
ఏఐ సాయంతో సాంకేతికతను, టెక్నాలజీని తెరపైకి తెచ్చి వినూత్నంగా ప్రచారం చేశాయి.స్పూఫ్ లు, తీవ్రమైన వ్యంగ్యబాణాలు, రోడ్ షోలు, ర్యాలీలు వేడెక్కించే నినాదాలతో పార్టీలన్నీ శాయశక్తులా పోరాడాయి. బీజేపి అంటే భారతీయ ఝూటా పార్టీ, నిందలు అసభ్యకరమైన దూషణలు చేసే పార్టీ అని ఆప్ దెప్పి పొడిస్తే.. ఆప్ అంటే వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శమని మోడీ కౌంటర్ అటాక్ చేశారు.కేజ్రీఆల్ అంటే ప్రకటనల మంత్రి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కూడా ఏం తక్కువ తినలేదు.కేజ్రీవాల్ అంటేనే ఫేక్ అని మోడీకి మరో చిన్న సైజు ప్రతిరూపమని తిట్టిపోసింది.