కర్ణాటకలోని బీదర్ లో ఏప్రిల్ 17వ తేదీన సాయి స్పూర్తి పియు కళాశాలలో కర్ణాటక సిఇటి పరీక్షా కేంద్రంలో తనచేత జంధ్యం (జాను) తొలగించమని బలవంతం చేశారని సుచివ్రత్ కులకర్ణి అనే విద్యార్థి ఆరోపించారు.
కులకర్ణికి ఏప్రిల్ 17న గణితం CET పరీక్ష ఉంది. విద్యార్థి పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పుడు, కళాశాల యాజమాన్యం తనిఖీ చేసి కులకర్ణి జంధ్యం(జాను)ను చూసింది. వారు దానిని కత్తిరించమని లేదా తీసివేయమని ఆదేశించారు. ఆ తర్వాతే వారు పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తామని కరాఖండిగా చెప్పారు.
జంధ్యం తమ సంప్రదాయానికి సంబంధించిన ఆంశమని… 45 నిమిషాలపాటు విద్యార్థి వారిని అభ్యర్థించాడు. పాఠశాల యాజమాన్యం వినకపోవడంతో చివరికి ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. విషయం కుటుంబసభ్యులకు చెప్పటంతో ఇరుగుపొరుగు వారు అందరు వెళ్లి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.
ప్రభుత్వం తిరిగి పరీక్ష నిర్వహించాలని లేదా ప్రభుత్వ కళాశాలలో సీటు ఇవ్వాలని విద్యార్థి కులకర్ణి డిమాండ్ చేశాడు. కర్ణాటకలో జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఘటనపై విచారణ జరిపి కర్ణాటక ప్రభుత్వం పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేశారు.