- సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించిన సోము వీర్రాజు నామినేషన్
- సోము వీర్రాజు కోసమే తమకో స్ధానం కావాలని అడిగిన బీజేపీ
- రాష్ట్ర బీజేపీకి తెలియకుండానే సోము అభ్యర్ధిత్వం ఖరారు
- టీడీపీ చెపితేనే ఏపీ బీజేపీకి తెలిసిన సోము వీర్రాజు ఎంపిక
సోము వీర్రాజు… భారతీయ జనతా పార్టీకి చెందిన ఈ సీనియర్ నాయకుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. పార్టీకి వీర విధేయుడు. విద్యార్థి దశ నుంచి ఎత్తిన జెండా దించకుండా నలభై ఏళ్ళపాటు బీజేపీనే ప్రాణంగా అనేక పాత్రలు పోషించారు. పార్టీ కూడా ఆయన పట్ల అంతే వాత్సల్యంతో ఉందనడానికి తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. వాస్తవానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాల్లో ఎన్నికైన ఐదుగురు శాసనమండలి సభ్యులు ఈ నెల 29వ తేదీతో పదవీ విరమణ పొందనున్నారు. ఆ స్ధానాలకు ఈ నెల 20వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు కూడా కూటమి పార్టీలకే దక్కే అవకాశం ఉంది. కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచే దాదాపు 30 మంది ఆశావాహులు ఉన్నారు. ఇక కూటమి మరో భాగస్వామి జనసేన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు ఒక ఎమ్మెల్సీ స్ధానానికి కర్చిఫ్ వేసుకుని కూర్చున్నారు. మిగిలిన నాలుగు స్ధానాల్లో తమ ఆశావాహులను ఎలా అడ్జస్ట్ చెయ్యాలో అర్ధంకాక టీడీపీ సతమతమవుతోంది.
చంద్రబాబుకి నడ్డా, అమిత్‌షాల ఫోన్లు
ఈ దశలో నామినేషన్ల గడువు మరొక్క రోజులో ముగుస్తుందనగా ఢిల్లీ నుంచి బీజేపీ అధ్యక్షుడి నుంచి చంద్రబాకు ఫోన్. తమకు ఒక ఎమ్మెల్సీ స్ధానం సోము వీర్రాజు కోసం కావాలని డిమాండ్. ఊహించని విధంగా నడ్డా తమకొక ఎమ్మెల్సీ స్ధానం కావాలని అడగటంతో పరిస్ధితి చాలా టైట్‌గా ఉందని, తమ పార్టీ నుంచే 30 మంది ఆశావాహులు ఉన్నారని, ఎన్నికల సమయంలో చాలా మందికి హామీలు ఇచ్చామని నడ్డాకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఆ వెనువెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. మాకు ఒక ఎమ్మల్సీ స్ధానం సోము వీర్రాజు కోసమే కావాలని, మొన్నటి ఎన్నికల సమయంలో ఆయనకు అన్యాయం జరిగిందని, అప్పుడు జరిగిన కొన్ని రాజకీయాల కారణంగా ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేకపోయామని ఇప్పుడు ఆ నష్టాన్ని వీర్రాజుకు భర్తీ చెయ్యాలని చెప్పడంతో ఒక ఎమ్మెల్సీ స్ధానం బీజేపీకి ఇవ్వడం చంద్రబాబుకు తప్పలేదు.
రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలియకుండానే
అయితే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే నిర్ణం ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖకు ఎటువంటి ప్రమేయం లేకుండా పూర్తిగా బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. అసలు బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇస్తున్నామని, ఆ స్ధానానికి సోము వీర్రాజు పేరు నడ్డా, అమిత్ షాలు ప్రతిపాదించినట్లు టీడీపీ చెపితేనే రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలిసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఒక సీటు జనసేనకు ఇవ్వాలని నిర్ణయించగా, తమకు సీటు అక్కర్లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం చెప్పినట్లు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. అందువల్లే చివరి రోజు వరకూ మిగిలిన నాలగు స్ధానాలకు టీడీపీ చెందిన అభ్యర్ధులనే ఎంపిక చెయ్యడానికి చంద్రబాబు కసరత్తు చేశారు. కానీ ఊహించని విధంగా ఢిల్లీ నుంచి నడ్డా, అమిత్‌షాలు ఫోన్లు చేసి, సోము వీర్రాజు ప్రాతినిధ్యం బీజేపీ తరపున మండలిలో ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు చెప్పడంతో చంద్రబాబు కూడా పొత్తు ధర్మం పాటించి సోము అభ్యర్థిత్వానికి ఓకే చెప్పేశారు.
సోము నామినేషన్ కోసం రెండు స్పెషల్ ఫ్లైట్లు
అంతటితో కథ సుఖాంతమైతే అది ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ఎలా అవుంతుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం సోము వీర్రాజు అభ్యర్థిత్వం ఖారారు అయినట్లు టీడీపీ నుంచి రాష్ట్ర బీజేపీకి తెలియడంతో ఆ పార్టీ అధ్యక్షురాలు, రాజమండ్రీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెంటనే పార్లమెంటు సమావేశాల కోసం సోమవారం ఉదయమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయారు. విచిత్రంగా సోము వీర్రాజు నామినేషన్ వెయ్యడానికి ఏపీ స్టేట్ బీజేపీ ఆఫీసులో బీ ఫారాలు నిండుకున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు బీ ఫారాలు లేవని తెలియజేశారు. ఈ పరిణామాలన్నింటినీ కేంద్ర నాయకత్వానికి ఒకరిద్దరు సీనియర్ నాయకులు వివరించడంతో వెంటనే అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లోలో దగ్గుబాటి పురంధేశ్వరి బీఫారమ్ పై సంతకం చెయ్యడానికి, సోము వీర్రాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యారు. అదే పమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బీ ఫామ్ తీసుకుని విజయవాడకు మరో స్పెషల్ ఫ్లైట్ బయలుదేరింది. అటు ఢిల్లీ నుంచి పురంధేశ్వరి తోడు రాగా, ఇటు తెలంగాణ నుంచి వచ్చిన బీ ఫారం తీసుకుని సోము వీర్రాజు సోమవారం మధ్యాహ్నం 2.46గంటలకు అంటే నామినేషన్ల గడువు మరో 14 నిమిషాల్లో ముగుస్తుందనగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన తరువాత పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్, శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి, పార్థసారధిలు తోడు రాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా చంద్రబాబు సోము వీర్రాజును అభినందిస్తూ… మీ ఢిల్లీ పెద్దలు నీ పేరు చెప్పబట్టే నేను బీజేపీకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చానని, లేకపోతే ఇప్పుడు పార్టీలో ఉన్న ఒత్తిడికి ఇచ్చే వాడిని కాదని చంద్రబాబు అనడం కోసమెరుపు.