జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్ద బాధ్యతలను అప్పగించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఆయనపై బీజేపీకి నమ్మకం చాలా ఎక్కువగా ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి క్యాడర్ ఉన్నప్పటికీ.. ప్రజల్లో ప్రాచుర్యంం ఉన్న నాయకుల కొరత వెంటాడుతోంది. కర్ణాటకలో యడ్యూరప్ప రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత అక్కడ నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు.. తమిళనాడులో పార్టీని గెలిపించే స్థాయిలో ప్రజాదరణ కలిగిన నేత బీజేపీలో లేరు. కేరళలోనూ అదే పరిస్థితి. తెలంగాణలో నేతలు ఉన్నా, బలమైన ప్రజాదరణ కలిగిన, పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగే స్థాయి నాయకుడు లేడని అధిష్టానం భావిస్తోంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే. బీజేపీకి పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు.
ఇలాంటి సమయంలో దక్షిణాదిలో బీజేపీకి అవసరమైన క్రౌడ్ పుల్లర్ నాయకుడిగా పవన్ కల్యాణ్‌ను ఎంపిక చేసుకుందంటున్నారు. ఆయన చరిష్మాను ఉపయోగించుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోందట. పవన్ కల్యాణ్ కూడా కొంత కాలంగా బీజేపీ అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహరిస్తున్నారన్న పేరు వచ్చింది. ఢిల్లీ నాయకత్వాన్ని విస్మరించే స్థితిలో పవన్ కల్యాణ్ లేరని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లకపోయినా వారితో టచ్‌లోనే ఉంటారని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల సనాతన ధర్మంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించడం వెనుక కూడా బీజేపీ మార్గదర్శకత్వం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందూ ధర్మానికి మద్దతు ఇచ్చే విషయాల్లో పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తుండటం దానికి సంకేతమంటున్నారు.
ఏపీలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్‌కి సభా వేదికపై నుంచే ఇస్తున్న గౌరవం, చూపిస్తున్న ఆదరణకు ఇది నిదర్శనమంటున్నారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో మోదీ పవన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘సోదరుడి’గా పిలిచి చాక్లెట్ ఇచ్చిన దృశ్యం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. మోదీ చేసిన ప్రసంగం జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయనను ‘యువనేత’గా మోదీ కొనియాడారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటించింది. కానీ, అక్కడ మరింత బలంగా నిలవాలంటే పవన్ కల్యాణ్ అవసరమవుతారని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. దీంతో పవన్‌ను తమిళనాడు ప్రచారంలో కీలకంగా వినియోగించే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. తర్వాత దశలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ పవన్ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ అనుకుంటోందట. మొత్తం మీద పవన్ కల్యాణ్‌కు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యత ఏపీలో కూటమిలోని టీడీపీకి మింగుడు పడలేకుండా ఉందంటున్నారు.