28.9 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

కేసీఆర్‌కు అనర్హత భయం?

మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లో.. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అదీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం నాడు సభకు హాజరయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఇక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ కనీసం ఒకరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఈ ఇద్దరు నాయకులకూ చాలా అంశాల్లో పోలికలున్నాయి. మొన్నటిదాకా ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పనిచేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్‌.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు నాయకులూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఎన్నికల తర్వాత తమ పార్టీలు అధికారం కోల్పోగానే.. ఇద్దరు నాయకులూ అసెంబ్లీకి హాజరు కాలేదు. కేవలం ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రమే హాజరయ్యారు. కేసీఆర్‌ మాత్రం గత యేడాది ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారు.

అయితే, అసెంబ్లీకి హాజరు కాకపోతే.. నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడుతుందన్న ప్రచారమే ఈ ఇద్దరు నేతలూ అసెంబ్లీకి హాజరు కావడానికి కారణంగా చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభా కార్యక్రమాల్లో హాజరు నమోదు చేసుకున్నారు. ఫలితంగా అధికార కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి చెక్‌ పెట్టారు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారట. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు వస్తారంటున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు కేసీఆర్‌ బడ్జెట్ ప్రసంగం వినేందుకు అసెంబ్లీకి హాజరవుతారని చెబుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ.. తమ పార్టీ ఓడిపోవడంతో అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే ఎన్నికయ్యారు. అయినా.. జారిపడి గాయం అయిన కారణంగా మొదట్లో అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆ తర్వాత గత యేడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం విని వెళ్లి పోయారు. మళ్లీ ఇప్పటి వరకూ అసెంబ్లీ వైపు దృష్టి పెట్టలేదు. మరోసారి ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

నిబంధనల ప్రకారం 60 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు వేయడానికి స్పీకర్‌కు అధికారం ఉంటుంది. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే.. కేసీఆర్‌పై అనర్హత వేటు వేయడానికి అధికార పక్షానికి అవకాశం లభిస్తుంది. ఉపఎన్నికలు వస్తాయా, రావా? అన్నది పక్కన పెడితే అసెంబ్లీకి హాజరు కాక పోవడం వల్ల కేసీఆర్‌పై అనర్హత వేటు పడిందన్నది ఆయన పొలిటికల్‌ కెరీర్‌లో ఆయన ఇమేజ్‌కు ఓ మచ్చలా తయారవుతుంది. కాబట్టి ఒకే ఒక్కరోజు ఆసెంబ్లీకి హాజరు కావాలని కేసీఆర్‌ సన్నిహితులు ఆయనను ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌.. తొలిరోజు గవర్నర్ ప్రసంగం నాడు సభకు వెళ్లినట్టు కాకుండా.. సభా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, అది కూడా బడ్జెట్‌ ప్రసంగం గానీ, బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో గానీ ఒక్కరోజు అసెంబ్లీకి హాజరు కావాలని కేసీఆర్‌ అనుకుంటున్నారట. ఈ ఒక్కసారి సభకు హాజరైతే.. మరో అరవై పని రోజుల వరకూ అసెంబ్లీకి హాజరు కాకపోయినా ఇబ్బంది ఉండదనుకుంటున్నారని చెబుతున్నారు.

ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకైతే అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకపోయినా.. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరై.. ప్రభుత్వాన్ని పలు అంశాలపై ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తే ప్రభుత్వాన్ని మరింత బలంగా నిలదీసే అవకాశం ఉండొచ్చచ్చని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అటు.. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ పదే పదే ప్రశ్నిస్తోంది. దీంతో అసెంబ్లీకి హాజరు కావాలనే కేసీఆర్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీకి ఆయన ఒక్కరోజే వస్తారా లేదంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేయవచ్చని.. బడ్జెట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు హాజరవుతారా? అన్నది చూడాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com