ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు సింహభాగం పెట్టుబడులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు విజయం సాధించారు. ఇద్దరు నేతలు సమన్వయంతో బహుళ జాతి సంస్థల ప్రతినిధులతో మూడు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించారు.
తెలంగాణలో ఉన్న అవకాశాలు వివరిస్తూ కంపెనీలను మెప్పించారు. దీంతో తెలంగాణకు 1,78,950 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా సుమారు 50,000 వేల ఉద్యోగాలు తెలంగాణలో కొత్తగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశాల ద్రశ్య మాలిక
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందానికి స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ ఎయిర్ పోర్ట్ లో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.
జ్యురిచ్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు రైలులో బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు
దావోస్ లో తొలి రోజున గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్ లతోపాటు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభమైన తొలి రోజు పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన తొలి సమావేశంలో ఎజిలిటీ చైర్మన్ తారెక్ సుల్తాన్ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును కలిశారు. తమ ప్రభుత్వం రైతులపై దృష్టి సారించి, వారి ఆదాయాన్ని స్థిరమైన రీతిలో పెంచుతుందని సమావేశంలో శ్రీధర్ బాబు అన్నారు.
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో దిగ్గజ కంపెనీతో చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను చర్చించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సాంబానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూ లే తో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఏఐ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అందించటంలో పేరొందిన సంస్థతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి.
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న స్కైరూట్ కంపెనీ.
హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్ లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.
రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) పై సంతకాలు చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి శ్రీధర్ భాబు సమక్షంలో మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
డబ్ల్యూఈఎఫ్ సీఐఐ సదస్సు రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. అర్బన్ మొబిలిటీ యొక్క నాలుగు అంశాలను ప్రస్తావించిన సీఎం రేవంత్. హైదరాబాద్ భవిష్యత్తు నగరాన్ని అర్బన్ మొబిలిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చాలని అనుకుంటున్నట్టు వెల్లడి.
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌తో చర్చలు జరిపారు.
హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ అందుకుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి.
తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యంలోని ప్రతినిధి బృందం కూడా అదే సమయంలో అక్కడికి చేరుకుంది. జ్యురిచ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల బృందాలు ఫొటోలు దిగారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వ్యవస్థాపకుడు, ప్రపంచ ఆర్థిక విధానాలను ఆవిష్కరించిన ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
నేచర్ పాజిటివ్ పిల్లర్ కో-హెడ్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, 1t.org, WEF హెడ్ ఫ్లోరియన్ వెర్నాజ్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఒక ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సతత హరితంగా మార్చే ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం ‘ (Trillion Tree Campaign)లో భాగమవుతానని ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు.
సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసింది. భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇప్పటివరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.
రాష్ట్రంలో అధునాతన అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (UAV) తయారీ యూనిట్, రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన జేఎస్ డబ్ల్యూ. జెఎస్ డబ్ల్యు డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన JSW UAV లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు తో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది.
విప్రో కంపెనీ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి లో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తో సమావేశమయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్పోసిస్ ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంగ్రాజ్కా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో ఇన్ఫోసిస్ సంస్థ రూ. 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది.
హైదరాబాద్ లొ రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది.