-
తెనాలి కళాకారులచే రూపకల్పన
-
అమరావతి సభలో ప్రత్యేక ఆకర్షణ
-
ప్రదర్శనకు అనుమతించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ప్రధాని సభ వేదిక వద్దకు వెళ్లే సమయంలో ప్రత్యేకంగా రూపొందించిన మోదీ విగ్రహాన్ని ఆయన తిలకించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆటో మొబైల్ రంగంలో ఉపయోగించే ఐరన్ స్క్రాప్, నట్టులు, బొల్టులతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ‘వెలకమ్ అమరావతి’ అనే అక్షరాల డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.
ఈ విగ్రహాలను తెనాలికి చెందిన ప్రముఖ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరావు, ఆయన కుమారులు రవిచంద్ర, సూర్య కుమార్ రూపొందించారు. మోడ్రన్ ఆర్ట్‌లో నిష్ణాతులైన ఈ కుటుంబం ఇప్పటికే అనేక విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనలు నిర్వహించారు. స్క్రాప్‌తో మోడీ విగ్రహంతో పాటు బైసన్, జీపు, సింహం, సైకిల్ వంటి ఆకృతులను కూడా రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రావడం పురస్కరించుకుని లక్షలు ఖర్చు చేసి అనేక విగ్రహాలను తయారు చేసినట్టు శిల్పకారుడు వెంకటేశ్వరావు తెలిపారు. ఈ విగ్రహాలను సభ వద్ద ప్రదర్శించేందుకు అధికారులు అనుమతి కూడా ఇచ్చారు.
మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, సైకిల్, తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ చిహ్నాన్ని కూడా ఐరన్ స్క్రాప్‌తో తయారు చేసి ప్రదర్శనలో ఉంచనున్నారు. అమరావతి పేరును తీగతో రూపొందించిన డిజైన్ కూడా సందర్శకులను ఆకట్టుకునేలా సిద్ధమైంది. ఈ విగ్రహాలను సభకు వచ్చే ప్రముఖులతో పాటు ప్రజలు తిలకించాలని శిల్పి రవిచంద్ర ఆకాంక్షించారు. తెనాలి ప్రాంతం శిల్పకళకు పేరుగాంచిందని, తమ కుటుంబం గతంలో అనేక అవార్డులు అందుకుందని శిల్పులు వివరించారు. మోడీ విగ్రహంతో పాటు ఇతర శిల్పాలు చూసినవారు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.