చిచ్చరపిడుగులా రెచ్చిపోయిన అభిషేక్ శర్మ
బౌలింగులో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి
సిరీస్ లో ముందడుగు
టీమ్ ఇండియాలో యువ క్రికెటర్లు దుమ్ము దుమారం రేపుతున్నారు. ఒకవైపు సీనియర్లు పదే పదే నిరాశపరుస్తున్నా
టీ 20ల్లో మాత్రం మేమున్నామంటూ యువత ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. వీరిని చూసి నేర్చుకోమని అప్పుడే నెటిజన్లు సీనియర్లకు చురకలు అంటిస్తున్నారు.
ఇంగ్లండ్ తో 5 టీ 20ల సిరీస్ లో భాగంగా తొలిమ్యాచ్ కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్ లో జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఇంగ్లండు ఆది నుంచి తడబడుతూనే ఆడింది.
భారత యువ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్య చేధనలో టీమ్ ఇండియా ఆడుతూ పాడుతూ 12.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది.
మొదట బ్యాటింగు చేసిన ఇంగ్లండు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), బెన్ డక్లెట్ (4) ఇద్దరూ నిరాశపరిచారు. వీరిద్దరిని అర్షదీప్ అవుట్ చేయడం విశేషం. అయితే ఫస్ట్ డౌన్ వచ్చిన కెప్టెన్ జాస్ బట్లర్ ఒంటరి పోరాటం చేశాడు. తను ఒక ఎండ్ లో ఆడుతున్నా, తనకి సపోర్ట్ ఇచ్చేవారే కరవయ్యారు. మధ్యలో వరుణ్ చక్రవర్తి స్పిన్ కి ఇంగ్లండ్ బ్యాటర్లు తెల్లమొఖాలేసి వికెట్లు సమర్పించుకున్నారు.
మొత్తానికి తొలి ఓవర్ లో వచ్చిన కెప్టెన్ జాస్ బట్లర్ 16 ఓవర్ల వరకు నిలిచాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) వీరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మొత్తానికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయిపోయారు.
భారత బౌలింగులో అర్షదీప్ 2, హర్దిక్ పాండ్యా 2, వరుణ్ చక్రవర్తి 3, అక్షర పటేల్ 2 వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్ కి వికెట్లు పడలేదు.
అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బ్యాటింగు ప్రారంభించిన టీమ్ ఇండియా ఆడుతూ పాడుతూ అలవోకగా విజయం సాధించింది. ముఖ్యంగా ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లని ఆటాడుకున్నారు.
అయితే సంజూ శాంసన్ (26) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగులో లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాకపోతే అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్ ని ఉతికి ఆరేశాడు. 4 ఫోర్లు 1 సిక్స్ కొట్టి ఏకంగా 22 పరుగులు చేశాడు. తను అవుట్ అయ్యాక వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ డక్ అవుట్ అయి నిరాశ పరిచాడు.
జోఫ్రా ఆర్చర్ బౌలింగులో బాల్ ని… గాల్లోకి లేపి, కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ వచ్చాడు. అప్పటి నుంచి అభిషేక్ శర్మ విధ్వంసం మొదలైంది. ఇక ఏకదంపుడే దంపుడు… ఆ బౌలరు, ఈ బౌలరని లేదు. వచ్చినవాళ్లని వచ్చినట్టు తుక్కు రేగ్గొట్టాడు.
మ్యాచ్ లో 8 సిక్స్ లు కొట్టాడంటే తన విధ్వంసం ఎంత ఇదిగా సాగిందో అర్థమవుతుంది. కేవలం 34 బాల్స్ లో 79 పరుగులు చేసి లాంగ్ ఆన్ లో అవుట్ అయిపోయాడు. అయితే ఒకసారి లైఫ్ వచ్చింది. రెండు సార్లు ఫీల్డర్లు క్లిష్టమైన క్యాచ్ లు వదిలేశారు. మొత్తానికి అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
తను అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా (3) వచ్చి, తిలక్ వర్మ (19)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. ఇలా 5 టీ 20ల సిరీస్ లో తొలి విజయం నమోదైంది. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇంగ్లండు బౌలింగులో జోఫ్రా ఆర్చర్ బౌలింగులోనే టీమ్ ఇండియా ఇబ్బంది పడింది. తను 2 వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీశాడు. మిగిలిన వారందరూ తేలిపోయారు. ఆట్కిన్సన్ అయితే చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.
ఇకపోతే అత్యద్భుతంగా బౌలింగు చేసి, ఇంగ్లండు నడ్డి విరిచిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇక తొలి మ్యాచ్ ఇచ్చిన కిక్ తో.. జనవరి 25న చెన్నయ్ లో జరిగే రెండో టీ 20 కోసం అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.