భారత స్టాక్ మార్కెట్ పతనం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత స్టాక్ మార్కెట్ 28 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవి చూస్తోంది. గడిచిన ఐదు నెలల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.91.13 లక్షల కోట్లు కోల్పోయింది. అంటే గడిచిన ఐదు నెలల్లోనే స్టాక్ మార్కెట్ నుండి రూ. 91 లక్షల కోట్ల నిధులు తుడిచి పెట్టుకుపోయాయి. అయితే, అమ్మకాలు ఫ్రంట్‌లైన్ ఇండెక్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. బీఎస్ఇ స్మాల్-క్యాప్ ఇండెక్స్ 3.40 శాతానికి పైగా పడిపోయింది. బీఎస్ఇ మిడ్-క్యాప్ ఇండెక్స్ దాదాపు 3 శాతం క్షీణించింది.
స్టాక్ మార్కెట్లో ఈ గందరగోళం గత ఏడాది అక్టోబర్ నెల నుండి కొనసాగుతున్నప్పటికీ, ఫిబ్రవరి నెల స్టాక్ మార్కెట్‌కు ఒక రకంగా మృత్యుఘోషగా మారింది. ఫిబ్రవరి నెలలోనే దాదాపు రూ.41 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. జనవరి 31వ తేదీన బీఎస్ఇ మార్కెట్ క్యాప్ రూ.4,24,02,091.54 లక్షల కోట్లు. ఫిబ్రవరి నెల 28 రోజుల్లో రూ.40,80,682.02 కోట్ల నష్టం వాటిల్లింది. గణాంకాలను పరిశీలిస్తే, జనవరి నెలలో రూ.17,93,014.9 లక్షల కోట్ల నష్టం సంభవించింది. డిసెంబర్లో పెట్టుబడిదారులు రూ.4,73,543.92 లక్షల కోట్లు నష్టపోయారు. నవంబర్ గురించి మాట్లాడుకుంటే, పెట్టుబడిదారులు దాదాపు రూ.1,97,220.44 లక్షల కోట్ల లాభం ఆర్జించిన ఏకైక నెల ఇదే. ఫిబ్రవరి తర్వాత అత్యంత దారుణమైన నెల అక్టోబర్. అక్టోబర్‌లో బీఎస్ఇ మార్కెట్ క్యాప్ రూ.29,63,707.23 లక్షల కోట్లు తగ్గింది. 1996 తర్వాత వరుసగా 5 నెలలు మార్కెట్ క్షీణతను చూడటం ఇదే మొదటిసారి. గతంలో, 1996 సంవత్సరంలో మార్కెట్లో ఇటువంటి పరిస్థితి కనిపించింది. అక్టోబర్ నుండి స్టాక్ మార్కెట్ నిరంతర క్షీణతను చూస్తోంది. డేటా ప్రకారం, సెన్సెక్స్ 4,910.72 పాయింట్లు, అంటే 5.82 శాతం క్షీణించింది. నిఫ్టీ 1,605.5 అంటే 6.22 క్షీణించింది. నవంబర్ నెలలో సెన్సెక్స్ 0.52 శాతం అంటే 413.73 పాయింట్లు పెరిగింది. మరోవైపు, నిఫ్టీ 0.31 శాతం అంటే 74.25 పాయింట్లు క్షీణించింది. డిసెంబర్ నెలలో సెన్సెక్స్ 1,663.78 పాయింట్లు లేదా 2.08 శాతం పడిపోయింది. నిఫ్టీ 486.3 పాయింట్లు అంటే 2.01 శాతం క్షీణించింది. జనవరి నెలలో క్షీణత కాలం కనిపించింది. సెన్సెక్స్ 638.44 పాయింట్లు (0.82 శాతం) క్షీణించగా, నిఫ్టీ 136.4 పాయింట్లు (0.58 శాతం) క్షీణించింది.
సెప్టెంబర్ చివరిలో నమోదైన రికార్డు స్థాయి నుండి మార్కెట్ 14 శాతం పడిపోయింది. భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు జరిపారు. 2025లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ.1,13,721 కోట్ల విలువైన భారతీయ స్టాక్లను విక్రయించారని ఎన్ఎస్డీఎల్ డేటా చూపిస్తోంది. ఐదు నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుండి దాదాపు 3.11 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో, ఎఫ్ఐఐలు రూ.47,349 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, డిఐఐలు రూ.52,544 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు చేశారు. అంతేకాకుండా ఆసియా మార్కెట్లు కూడా క్షీణతను చూశాయి.
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచే నిర్ణయం కారణంగా మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై 25 శాతం సుంకాన్ని డొనాల్ట్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఇది మార్చి 4 నుండి అమల్లోకి వస్తుంది. దీంతోపాటు, ట్రంప్ చైనా వస్తువులపై 10 శాతం సుంకం విధించారు. యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే సరుకులపై 25 శాతం సుంకం విధిస్తానని హామీ ఇచ్చారు. దీని కారణంగా మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. భారత స్టాక్ మార్కెట్ పతనంలో చైనా పాత్ర కూడా ముఖ్యమైంది.
కాగా, భారత మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడులు రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 2024 నుండి, భారతదేశ మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ డాలర్లు తగ్గింది. అయితే, చైనా మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. నిఫ్టీలో 1.55 శాతం క్షీణతకు భిన్నంగా, చైనా హ్యాంగ్ సెంగ్ సూచీ కేవలం ఒక నెలలోనే 18.7 శాతం పెరిగింది. మార్కెట్ ప్రస్తుతం దిద్దుబాటు స్థితిలో ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టే ముందు, కంపెనీ ప్రాథమికాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మీ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి.