భారతదేశ విదేశాంగశాఖ ప్రతినిధులు తాలిబన్లతో చర్చలు జరిపారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ చర్చలు అఫ్ఘానిస్థాన్‌లో కాకుండా దుబాయ్ వేదికగా జరిగాయి. ఇండియా నుంచి విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి మావ్లావి అమీర్ ఖాన్ దుబాయ్‌లో భేటీ అయ్యారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందేలా ఈ చర్చలు జరిగాయని తెలుస్తోంది. నిజానికి 2021లో అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లను చేజిక్కించుకున్నప్పటి నుంచి భారత్ అంతో ఇంతో సాయం చేస్తూనే వస్తోంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం చర్చలు, సంబంధాలు కొనసాగడం లేదు. అందుకే మానవతా సహాయం, అభివృద్ధి ప్రాజెక్టులు, వాణిజ్యం, క్రీడలు, సాంస్కృతిక సంబంధాలు వంటి పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది.
50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 300 టన్నుల మందులు, పోలియో వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ డోసులు.. ఇవీ ఇప్పటి వరకు భారత్ అధికారికంగా అందించిన సాయం. దీనిని మరింత పెంచాలని కోరుతోంది తాలిబన్ ప్రభుత్వం.
ఇవే కాకుండా ముఖ్యంగా క్రికెట్ కూడా చర్చల్లో హైలేట్ అయిన అంశమని తెలుస్తోంది. త్వరలో భారత్, అఫ్ఘాన్ మధ్య మ్యాచ్‌లు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే పాకిస్థాన్ ఇటీవల జరిపిన ఎయిర్‌స్ట్రైక్స్ గురించి జరిగిన చర్చ మరో ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువుగా మారింది పాక్. అంతేకాదు పాక్‌పై తమ ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే అఫ్ఘాన్ ప్రభుత్వ పెద్దలు శపథం చేశారు. దీంతో ఈ అంశంపై ఎలాంటి చర్చలు జరిగాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.