భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రంగా పెరుగుతోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన వైమానిక దాడులకు భారత్ శక్తివంతంగా ప్రతిస్పందించింది. పాక్‌కు చెందిన ఒక ఎఫ్-16, రెండు JF-17 యుద్ధవిమానాలను భారత వాయుసేన వినియోగిస్తున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా నేలకూల్చింది. అంతే కాదు, పలు ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన పాక్ డ్రోన్లను కూడా భారత భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ ప్రాంతాల వద్ద, జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో రెండు డ్రోన్లను భద్రతా వ్యవస్థలు సమర్థవంతంగా తరిమికొట్టాయి. ఈ ఘటనలతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది.
గత రాత్రి పాకిస్తాన్ పంజాబ్, జమ్ము కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. ముఖ్యంగా జమ్ము ఎయిర్‌పోర్టు, జైసల్మేర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్లు సమాచారం. సాంబా జాతీయ రహదారిని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తక్షణమే భారత వాయుసేన అప్రమత్తమై, ఎస్-400 వ్యవస్థను యాక్టివ్ చేయడంతో పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇప్పటివరకు భారత్ ఎనిమిది మిస్సైళ్లను, దాదాపు 30 డ్రోన్లను సమర్థవంతంగా తుడిచిపెట్టింది. పాక్ అగ్రెసివ్‌గా దాడులకు దిగుతున్న నేపథ్యంలో భారత సైన్యం కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు నగరాల్లో అత్యవసర చర్యలు ప్రారంభమయ్యాయి. జమ్ము, జైసల్మేర్, జలంధర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో పవర్ కట్ అమలులోకి వచ్చింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని అఖ్నూర్, కుప్వారా ప్రాంతాల్లో వార్ సైరన్లు మోగించి జనాలను అప్రమత్తం చేశారు. యుద్ధ వాతావరణం ఏ క్షణమైనా తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.