భారత్-పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో, భారత సైన్యం కీలక ప్రతిఘటన చేపడుతోంది. ఇటీవల పాకిస్తాన్ వర్గాలు ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిస్పందనగా రెచ్చగొట్టే విధంగా నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడ్డాయి. ఈ చర్యలకు భారత సైన్యం సమర్థంగా స్పందించింది. శత్రుదేశపు పలు సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు వినియోగించి పాక్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడికి సంబంధించిన స్పష్టమైన దృశ్యాలను భారత్ విడుదల చేసిన వీడియోలో చూడవచ్చు.
ఈ దృశ్యాల్లో పాక్ సైనిక పోస్టులు నేలమట్టమవుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ దాడులు జరిగిందెక్కడ అన్నది వెల్లడించలేదు. పాక్ డ్రోన్ల ద్వారా జరిగే చొరబాట్లను కూడా సమర్థంగా నియంత్రిస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 50 డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం. సరిహద్దు భద్రతను కాపాడేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి.