-
దేశవ్యాప్తంగా పలు పార్టీల నుంచి పిటిషన్లు
-
సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తోన్న పలు పార్టీల నాయకులు
-
తమిళనాడు నుంచి విజయ్, డీఎంకే ఎంపీ పిటిషన్లు
-
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ పిటిషన్
2025లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టంపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీయే యేతర పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. ముస్లిం మైనారిటీల హక్కులను ఉల్లంఘించేలా ఉందంటూ పలు రాజకీయ పార్టీలు, మత సంస్థలు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కొన్ని పార్టీలు పిటిషన్లు దాఖలు చేస్తుండగా.. మరికొందరు ఆయా పార్టీల ఎంపీలు, ప్రజా ప్రతినిధులు వ్యక్తిగతంగా పిటిషన్లు వేస్తున్నారు. తాజాగా, ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్, ఏపీ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రనెస్ పార్టీ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ చట్టం ముస్లింల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని, వారి ఆస్తులపై ప్రభుత్వ జోక్యాన్ని పెంచేలా ఉందని పిటిషన్లలో పేర్కొన్నారు. సెక్షన్లు 9, 14 వంటి నిబంధనల ద్వారా ముస్లిమేతర సభ్యులను వక్ఫ్ బోర్డుల్లో చేర్చడం సంస్థల మతపరమైన స్వతంత్రతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడుతున్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ జావేద్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. అలాగే.. జమియత్ ఉలేమా-ఇ-హింద్, సమస్త కేరళ జమియతుల్ ఉలేమా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి సంస్థలతో పాటు పలు ఎన్జీవోలు కూడా వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి.
ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆర్టికల్ 13, 14, 25, 26ల ఉల్లంఘనతో పాటు మతపరమైన సంస్థల స్వయం ప్రతిపత్తిని ఈ చట్టం హరిస్తుందని వాదించింది.
మరోవైపు, వక్ఫ్ చట్టానికి మద్దతుగా కూడా కొన్ని సంస్థలు జోక్యం చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో అనుకూలంగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సవరణలు రాజ్యాంగపరంగా సమంజసమైనవని, ముస్లిం హక్కుల ఉల్లంఘన జరుగలేదని పలు పార్టీలు, ఇతర ఎన్డీఏ మద్దతుదారులు వాదిస్తున్నారు. అటు.. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేముందు కేంద్ర ప్రభుత్వం వాదన వినాలంటూ అప్పీల్ చేసింది.
ఈ పరిణామాలతో వక్ఫ్ చట్టం చుట్టూ రాజకీయ, న్యాయ రంగాల్లో వాడి వేడి చర్చలు కొనసాగుతున్నాయి.