39.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

ఆయనకు అలా సాగుతోంది అంతే…!

కొంత మంది వ్యక్తులు ఉంటారు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళకి ఏం ఢోకా ఉండదు. ప్రభుత్వంలో ఎవరున్నారన్న విషయం వాళ్ళకు పట్టింపు ఉండదు. సదరు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో వీరిపై తీవ్ర స్ధాయి వ్యతిరేకత ఉన్నా సరే పదవులు సాధించేస్తారు అంతే. ఇదే కోవకు చెందిన వ్యక్తి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసిన యార్లగడ్డకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్దాయిలో కూడా అన్ని రాజకీయ పార్టీ అగ్రనేతల నివాసాలకు వెళ్లాలంటే కాలింగ్‌ బెల్లే అడ్డు. అన్ని రాజకీయ పార్టీలకు లక్ష్మీప్రసాద్ సనిహితుడే. కానీ ఆయా రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఈయన వాటని తూర్పారపడతారు. వారి విధానాలను, రాజకీయ పోకడలను తీవ్రంగా విమర్శిస్తారు. తిరిగి ఆయన విమర్శించిన పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ మళ్ళీ ఈయనే తొలి బంతిలో కూర్చుంటారు.

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజకీయ నాయకుడు కాదు కానీ తెలుగు రాజకీయాల్లో ఈయన పేరు మనం తరచు వింటూ ఉంటాం. కేంద్ర, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈయన పదవి మాత్రం పదిలం. తాజాగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సలహా సంఘం సభ్యుడిగా నియమించింది. ఈ సలహా సంఘంలో దేశ వ్యాప్తంగా పది మంది సభ్యులు ఉంటారు. అందులో మన రాష్ట్రం నుంచి యార్లగడ్డను నియమించడాన్ని తెలుగు తమ్ముళ్ళకు మింగుడు పడటం లేదు. యర్లగడ్డను ఆ పదవికి ఎవరు రికమండ్‌ చేశారనే విషయం అర్ధంకాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాల్లో ఎవరు లక్ష్మీ ప్రాసాద్‌ కి ఈ పదవి కట్టబెట్టారని టీడీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో యార్లగడ్డకు పదవి దక్కడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

తెలుగు తమ్ముళ్ళు యార్లగడ్డకు పదవి దక్కిన విషయంలో ఇంతగా బాధపడటానికి కారణాలు లేకపోలేదు. ఇంతకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో  యార్లగడ్డకు కీలకమైన నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి. ఆ సందర్భంగా జగన్‌ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ చంద్రబాబు, టీడీపీ విధానాలను ఆయన దుయ్యబట్టేవారు. అయితే జగన్మోహనరెడ్డితో ఎంతగా రాసుకుపూసుకు తిరిగినా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును తొలగించినప్పుడు విభేధించి తన పదవులకు రాజీనామా చేశారు. అయితే ఆ నిరసన చర్య అంతవరకే పరిమితం చేశారు తప్పితే జగన్మోహనరెడ్డికి మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నారు. చంద్రబాబుపై విమర్శలు సైతం మానలేదు. వాస్తవానికి యార్లగడ్డకు మొదటి నుంచి చంద్రబాబు వ్యతిరేకవర్గమనే పేరు ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అటువంటి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు కూటమిలో పదవి దక్కడం మాత్రం నిజంగా విశేషమే.

వాస్తవానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ కు ఇచ్చిన పదవి పెద్దదేం కాదుగానీ కూటమి ప్రభుత్వంలో అది కూడా దక్కడం టీడీపీ కార్యకర్తలకు ఇష్టం లేదు. ఎన్నికల ముందు ఆయన కూటమి తరపున ప్రచారం చేస్తానని బహిరంగ ఆఫర్‌ ఇచ్చినప్పటికీ ఆయన సేవలను కూటమి భాగస్వామ్య పక్షాలు ఉపయోగించుకోలేదు. ఆయన దగ్గరవుదామని ప్రయత్నించినా టీడీపీ, చంద్రబాబులు మాత్రం ఆయన్ను దూరం పెడుతూనే ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కు పదవి దక్కడం మాత్రం విశేషంగానే చెప్పుకోవాలి.

కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతంలో జన్మించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విద్యాధికుడు. హిందీలో ఎంఏ పట్టా పొందారు. ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగంలో ఆచార్యుడిగా పని చేశారు. తెలుగు హిందీ భాషల్లో పీహెచ్డీ పట్టాలు కూడా సాధించారు. నందిగామ కె.వి.ఆర్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఏయూలో ఆచార్యుడిగా 29 మంది విద్యార్థులకు పీహెచ్డీ మార్గదర్శకం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా, లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా చాలా రకాల పదవులు చేపట్టారు. పద్మ అవార్డులు కూడా దక్కించుకున్నారు. 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అందుకే అన్ని ప్రభుత్వాలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ప్రాధాన్యమిస్తూ వచ్చాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com